ఇంధన పొదుపు దిశగా టీటీడీ అడుగులు

30 Jan, 2023 04:21 IST|Sakshi

ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్, ఎనర్జీ డిపార్ట్‌మెంట్, ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్పొరేషన్, టీటీడీ అధికారుల వర్చువల్‌ భేటీ 

118 పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లు ఏర్పాటుకు నిర్ణయం 

తద్వారా ఏటా రూ.3.17 కోట్ల విలువైన 4.50 మిలియన్‌ యూనిట్ల ఇంధనం ఆదా 

సాక్షి, అమరావతి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇంధన సామర్థ్య చర్యల్లో భాగంగా పాత నీటి మోటార్ల స్థానంలో స్టార్‌ రేటెడ్‌ మోటార్లను అమర్చేందుకు యోచిస్తోంది. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం, విద్యుత్‌ ఆదాతో పాటు బిల్లులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యుత్‌ కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా ఈ బిల్లులను ఏడాదికి రూ.5 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో భాగంగా సంప్రదాయ హై కెపాసిటీ మోటార్ల స్థానంలో ఫైవ్‌ స్టార్‌ రేటెడ్‌ పంపు సెట్లను అమర్చనుంది. నీటి పంపింగ్‌ స్టేషన్లలో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం), ఎనర్జీ డిపార్ట్‌మెంట్, ఏపీ స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ సీఇడీసీఓ), టీటీడీ అధికారులు ఆదివారం వర్చువల్‌గా చర్చించారు. టీటీడీలో ప్రస్తుతం ఉన్న 118 పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. 

4.50 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా 
టీటీడీలో ఉన్న పంపింగ్‌ స్టేషన్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఎనర్జీ ఆడిట్‌ (ఐజీఈఏ) నిర్వహించినట్టు ఏపీ సీడ్‌కో, ఏపీ ఎస్‌ఈసీఎం సీనియర్‌ అధికారులు వెల్లడించారు. 118 పంపు సెట్లను ఇంధన సామర్థ్య పంపుసెట్లతో భర్తీ చేయడానికి సుమారు రూ.3.18 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. వీటివల్ల ఏటా రూ.3.17 కోట్ల విలువైన 4.50 మిలి­యన్‌ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఎల్‌ఈడీ లైటింగ్‌ ఉపకరణాలు, బ్రష్‌లెస్‌ డైరెక్ట్‌ కరెంట్‌ (బీఎల్‌డీసీ) ఫ్యాన్ల విభాగాల్లో టీటీడీలో ఎనర్జీ ఎఫిషియెన్సీ డెమోన్‌స్ట్రేషన్‌ ప్రాజెక్టులు అమలు చేశారు. మొదటి దశలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో 1000 ట్యూబ్‌ లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు, 400 ఫ్యాన్‌లను బీఎల్‌డీసీ ఫ్యాన్లతో భర్తీ చేశారు.

ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదికి 1.64 లక్షల యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. రెండో దశలో టీటీడీ భవనాలలో ప్రస్తుతం ఉన్న 5 వేల సీలింగ్‌ ఫ్యాన్ల స్థానంలో బీఎల్‌డీసీ ఫ్యాన్లతో భర్తీ చేయడానికి ఏపీ సీడ్‌కోతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి ఏటా రూ.62 లక్షల ఆదాతో దాదాపు 0.88 మిలియన్‌ యూనిట్లను ఆదా చేయగలవని భావిస్తున్నారు.

సమావేశంలో టీటీడీ చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరరావు, ఏపీఎస్‌ఈసీఎం సీఈఓ ఎ.చంద్రశేఖరరెడ్డి, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ జగదేశ్వరరెడ్డి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈసీ సెల్‌ రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు