గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ చేయూత

31 Oct, 2021 03:11 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో సభ్యులు పోకల అశోక్, మారుతి ప్రసాద్, రాములు, ఈవో డాక్టర్‌ జవహర్‌రెడ్డి, మాతా నిర్మలానంద యోగ భారతి తదితరులు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

ప్రారంభమైన జాతీయ గో మహాసమ్మేళనం

తిరుపతి కల్చరల్‌(చిత్తూరు జిల్లా): గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తాము కూడా అండగా ఉంటామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రైతుల నుంచి పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. జాతీయ గో మహాసమ్మేళనం శనివారం తిరుపతిలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారికి గో ఆధారిత ఉత్పత్తులతో నైవేద్యం, దేశీయ ఆవు పాలతో చిలికిన వెన్న సమర్పించేందుకు నవనీత సేవ చేపట్టామన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు.

సీఎం జగన్‌ ఆదేశాలతో దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 74 ఆలయాల్లో గుడికో గోమాత కార్యక్రమం మొదలుపెట్టామని.. త్వరలో ఈ సంఖ్యను 100 ఆలయాలకు పెంచుతామన్నారు. గోవుల విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. అనంతరం మాతా నిర్మలానంద యోగ భారతి ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, మొరం శెట్టి రాములు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సీవీఎస్‌వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీ గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి, యుగతులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శివకుమార్, సేవ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు విజయరామ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు