శ్రీవారికి శుభలేఖ పంపండి.. పెళ్లి కానుక అందుకోండి

8 Jul, 2021 04:33 IST|Sakshi

నూతన వధూవరులకు శ్రీవేంకటేశ్వరుని కానుక

టీటీడీ మహదవకాశం

తిరుమల:  తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు. చాలామంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. మరి దూరపు భక్తులు స్వామివారికి శుభలేఖను పంపించడమెలా? దీనికి టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. అదెలాగో తెలుసుకోండి..

మొదటి శుభలేఖ పంపవచ్చు..
ఇంట్లో వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం ‘శ్రీ లార్డ్‌ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్‌ చేయవచ్చు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది.  

మరిన్ని వార్తలు