ఏడాదిలో 500 ఆలయాలు

22 Jun, 2021 04:49 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణానికి టీటీడీ నిర్ణయం

భూమి కేటాయిస్తే అయోధ్యలోనూ.. 

తిరుమల: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో 500 ఆలయాలను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలి నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో చేపట్టే ఈ నిర్మాణాలను ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జమ్మూలో ఇటీవల భూమిపూజ చేసిన శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్‌ భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం, భజన మందిరం, యాత్రికుల వసతి సముదాయాల్లో వారు ఏది కోరితే అది నిర్మించాలని తీర్మానించింది.

ముంబై, వారణాసిల్లో కూడా శ్రీవారి ఆలయాలు, చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించి భక్తులకు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలి బాధ్యతలు స్వీకరించి సోమవారానికి (జూన్‌ 21) రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో పాలకమండలి దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి, హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను చేపట్టింది. గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముక్కోటి ఏకాదశి పండుగకు శ్రీవారి ఆలయంలో ఉత్తరద్వార దర్శనాన్ని 10 రోజులపాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి వైభవాన్ని ప్రచారం చేయడానికి 6 ప్రచార రథాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

కరోనాను ఎదుర్కోవడానికి సమర్థమైన చర్యలు తీసుకుంటూనే భక్తులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలనుకరోనా బారిన పడకుండా కాపాడాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణ వంటి  కార్యక్రమాలు చేట్టింది.   గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్యక్రమం కింద సహజ ఆధారిత పంటలతో స్వామికి తయారు చేస్తున్న నైవేద్యాల కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. కాగా, కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో వలసకూలీల కోసం సుమారు 35.50 లక్షల అన్నప్రసాదం ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేసింది. తిరుపతిలోని  సత్రాలను కోవిడ్‌ కేర్‌ సెంటర్ల  కోసం అప్పగించి, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చింది.  వెంటిలేటర్లు, ఇతర పరికరాల కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగానికి రూ.19 కోట్లు ఇచ్చింది.  

మరిన్ని వార్తలు