TTD: ప్రకృతి సాగుకు శ్రీవారి ప్రోత్సాహం

20 Dec, 2021 23:04 IST|Sakshi

930 ఆవులు, 1,200 ఎద్దులు ఉచితంగా పంపిణీ చేస్తున్న టీటీడీ

వీటి విలువ రూ. 8 కోట్లపైనే

గోమూత్రం, పేడలతో సాగుకు అవసరమైన జీవామృతాల తయారీ

రైతుల ఆర్థిక పరిపుష్టికి బాటలు

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి సాగు చేసే రైతన్నలకు టీటీడీ గోశాలలోని దేశీ ఆవులు, ఎద్దులను ఉచితంగా అందజేయడం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి బాటలు వేస్తోంది. ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసీఎన్‌ఎఫ్‌) కింద రాష్ట్రంలో 3,730 గ్రామ పంచాయతీల్లో 4.79 లక్షల మంది రైతులు 5.06 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేస్తున్నారు.

వీరంతా రసాయనాలు, పురుగుల మందులు కాకుండా ఆవు పేడ, మూత్రంతో తయారు చేసే జీవామృతాలు వినియోగిస్తారు. ఇందుకోసం కొంతమంది రైతులు సొంతంగా పాడిని పోషిస్తుండగా, మరికొంత మంది ఊళ్లోని ఇతర రైతుల పోషించే ఆవులు, ఎద్దుల పేడను సేకరిస్తుంటారు. ఒక్కోసారి ఇవి సకాలంలో దొరక్క ప్రకృతి సాగు చేసే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం టీటీడీ దృష్టికి వెళ్లడంతో.. తమ గోశాలల్లో పెద్ద సంఖ్యలో ఉన్న దేశీ ఆవులు, ఎద్దులను రైతులకు అందించాలని నిర్ణయించింది.

ఈ మేరకు రైతు సాధికార సంస్థతో టీటీడీ పాలకమండలి ఓ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ. 8 కోట్లకు పైగా విలువైన 930 ఆవులు, 1,200 ఎద్దులను చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైతులకు ఉచితంగా అందజేస్తోంది. దశల వారీగా మిగిలిన జిల్లాల్లోని రైతులకు అందిస్తారు. ఈ నెల 9న చిత్తూరు జిల్లాలో పంపిణీకి టీటీడీ శ్రీకారం చుట్టింది. రోజుకి 30 నుంచి 50 పశువుల చొప్పున ఈ నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేయాలని సంకల్పించింది.

ఒక ఆవు లేదా రెండు ఎద్దులు
మహిళా సంఘాల ఆధ్వర్యంలో పూర్తిగా ప్రకృతి సాగు చేసే రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆవులు, ఎద్దులను అమ్మడం, కబేళాలకు తరలించమని లిఖిత పూర్వక హామీ పత్రమివ్వాలి. ఎంపికైన లబ్ధిదారులు స్వయంగా గోశాలకు వచ్చి తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో లబ్ధిదారునికి ఒక ఆవు లేదా రెండు ఎద్దులిస్తారు. దేశీ ఆవు పేడలో ఉండే సూక్ష్మజీవులు (మైక్రోబ్స్‌) భూమిని సారవంతం చేస్తాయి.

ఒక గ్రాము పేడలో 0.5–1.05 శాతం నత్రజని, 0.3–0.9 శాతం భాస్వరం, 0.5–1.09 శాతం పొటాషియం ఉంటాయి. ఆవు పేడ, మూత్రాలతో ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేయవచ్చు. ఇక దేశీ ఆవు పాలు లీటర్‌ రూ. 70 నుంచి రూ. 80 ధర పలుకుతుంది. ఇక నెయ్యి కిలో రూ. 2,500 ధర ఉంది. అవసరం మేరకు పేడ, మూత్రం వినియోగించుకుని.. మిగతా మొత్తాన్ని అమ్ముకోవచ్చు. ఇలా లబ్ధిదారు కుటుంబానికి అదనపు ఆదాయం సమకూరుతుంది.

ఎదురు చూసే బాధ తప్పింది
నేను 2 ఎకరాల్లో 4 ఏళ్లుగా ప్రకృతి సాగు చేస్తున్నాను. ఘన, ద్రవ జీవామృతాలకు అవసరమైన ఆవు పేడ, మూత్రం కోసం ఇతర రైతుల ఇంటి వద్ద ఎదురు చూడాల్సి వచ్చేది. ఇటీవలే టీటీడీ గోశాల నుంచి దేశీ ఆవును తెచ్చుకున్నాను. సాగుకు అవసరమైన ఇన్‌పుట్స్‌ తయారు చేసుకోగా మిగిలిన పేడను సంఘ సభ్యులకు అందజేస్తున్నా.
– ఎం.పాండు. కోటావారిపల్లి, మదనపల్లె మండలం

ప్రకృతి సాగులో టీటీడీ భాగస్వామ్యం
ప్రకృతి సాగు విస్తరణలో టీటీడీ భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా టీటీడీ గోశాలలోని దేశీ గోవులు, ఎద్దులను రైతులకందించేందుకు టీటీడీ ముందుకురావడం శుభ పరిణామం.
– టి.విజయకుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

వెంకన్న వర ప్రసాదం
ఇప్పటి వరకు జెర్సీ ఆవు పేడ ఉపయోగిస్తున్నాను. టీటీడీ వారు ఇచ్చిన ఆవు వెంకన్న సన్నిధి నుంచి వచ్చిన వర ప్రసాదంగా భావించి కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. నా పొలానికేకాదు సంఘ సభ్యులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ సామూహికంగా తయారు చేసుకుంటున్నాం. నాటి ఎద్దులతో దేశీ ఆవుల సంతతి పెంచేందుకు కృషి చేస్తాం.
– జి.అమరావతి, మిట్టపల్లి, కుప్పం మండలం

మరిన్ని వార్తలు