బ్రహ్మోత్సవాల్లో మాస్క్‌ తప్పనిసరి

5 Aug, 2022 04:36 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల: సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్‌ తప్పని సరిగా ధరించాలని చెప్పారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్నమయ్య భవనంలో గురువారం ఆయన ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డితో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్‌ 26న అంకురార్పణ, 27న ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు చెప్పారు. 27న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేస్తామని, ఆర్జిత సేవలు, శ్రీవాణి, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రివిలైజ్డ్‌ దర్శనాలను రద్దు చేశామని పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 లక్షల లడ్డూలను బఫర్‌ స్టాక్‌గా ఉంచనున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు