ఎల్లెల్సీ ఆధునికీకరణతోనే జలచౌర్యానికి అడ్డుకట్ట 

23 May, 2021 09:53 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించిన తుంగభద్ర బోర్డు

ఈ సీజన్‌లో 115 కి.మీ. వరకూ పనుల పూర్తికి కసరత్తు

2023లోగా రాష్ట్ర సరిహద్దు 250.58 కి.మీ. వరకూ ఎల్లెల్సీ ఆధునికీకరణ

రాష్ట్ర సరిహద్దుకు 725 క్యూసెక్కులు చేరడానికి మార్గం సుగమం

తద్వారా 1,51,134 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా 

సాక్షి, అమరావతి: కాలువలను ఆధునికీకరించడం ద్వారా జలచౌర్యానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసే దిశగా తుంగభద్ర బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) రాష్ట్ర సరిహద్దు వరకూ కర్ణాటక పరిధిలో 105.435 కి.మీ. పొడవునా ఆధునికీకరణ పనులను పూర్తి చేసింది. దీంతో ఏపీ సరిహద్దుకు హెచ్చెల్సీ ద్వారా 2,200 క్యూసెక్కులను సరఫరా చేసేలా కాలువ ప్రవాహ సామర్థ్యం పెరిగింది.

సిమెంటు లైనింగ్‌ చేయడం వల్ల హెచ్చెల్సీలో జలచౌర్యానికి అడ్డుకట్ట పడింది. ఇదే తరహాలో ఎల్లెల్సీ (దిగువ కాలువ)ను ఆధునికీకరించడం ద్వారా జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ఈ సీజన్‌లో కర్ణాటక పరిధిలో 115 కి.మీ. వరకూ ఆధునికీకరించే పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2021–22, 2022–23లో 115 కి.మీ. నుంచి ఏపీ సరిహద్దు వరకూ 250.58 కి.మీ. వరకూ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రచించింది. తద్వారా రాష్ట్ర సరిహద్దుకు ప్రస్తుత డిజైన్‌ ప్రకారం 725 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తుంగభద్ర బోర్డు ఆమోదించింది. దీంతో కర్నూలు జిల్లాలో 1,51,134 ఎకరాలకు నీటిని అందించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

జలచౌర్యంతో ఆయకట్టుకు కష్టాలు.. 
తుంగభద్ర జలాశయం దిగువ కాలువకు 43 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. ఇందులో కర్ణాటక వాటా 19 టీఎంసీలు.. ఏపీ వాటా 24 టీఎంసీలు. తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాలువ 250.58 కి.మీ. వరకూ కర్ణాటక పరిధిలో ఉండగా 250.58 కి.మీ. నుంచి 324 కి.మీ. వరకూ రాష్ట్ర పరిధిలో ఉంది. కర్ణాటక వాటాపోనూ రాష్ట్ర సరిహద్దుకు 725 క్యూసెక్కులు చేరాలి. కానీ కర్ణాటక పరిధిలో రైతులు కాలువకు గండ్లు కొట్టడం, పైపింగ్‌ ద్వారా భారీ ఎత్తున జలచౌర్యం చేస్తుండటంతో రాష్ట్ర సరిహద్దుకు 400 నుంచి 450 క్యూసెక్కుల మేర కూడా చేరడం లేదు. దాంతో కర్నూలు జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. 

మరిన్ని వార్తలు