వచ్చేనెల 20 నుంచి డిసెంబర్‌ 1 వరకు పుష్కరాలు

17 Oct, 2020 18:59 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

ఏర్పాట్లకు ఇప్పటికే రూ.199.91 కోట్లు మంజూరు చేసిన సర్కార్‌

కర్నూలు జిల్లా పరిధిలో తుంగభద్ర నదీతీరంలో 20 ఘాట్ల నిర్మాణం

పురాతన ఆలయాలకు వెళ్లే రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరుల్లో రహదార్లకు కొత్తరూపు

నవంబర్‌ 16లోగా ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం

వచ్చేనెల 20 నుంచి డిసెంబర్‌ 1 వరకు పుష్కరాలు

సాక్షి, అమరావతి: ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అత్యంత ప్రాశస్త్యమున్న తుంగభద్ర నదీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారిసంఖ్యను ముందే అంచనా వేసి.. ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఏర్పాట్ల కోసం రూ.199.91 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పనుల్ని నవంబర్‌ 16 నాటికి పూర్తిచేయాలని నిర్దేశించింది. నవంబర్‌ 20న ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలు డిసెంబర్‌ 1న ముగుస్తాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఆ మహానేత తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.

వరద తగ్గగానే పుష్కర ఘాట్ల నిర్మాణం

  • తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో 20 చోట్ల పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.91 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పదిరోజుల్లో వరద తగ్గిన వెంటనే ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • పుష్కర ఘాట్లు, నదీ తీరప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యమున్న పురాతన ఆలయాలకు వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, అవసరమైన చోట కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పనులకు ఆర్‌ అండ్‌ బీ శాఖ రూ.117 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.30 కోట్లు మంజూరు చేశాయి.
  • కర్నూలు నగరంలోను, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లోను పారిశుధ్యం, అంతర్గత రహదారులకు కొత్తరూపు ఇవ్వడానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి.

నిరంతరం మంత్రుల సమీక్ష
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పుష్కరాల ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, కార్మికశాఖ మంత్రి జయరాం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ నేతృత్వంలో 21 శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్ల కమిటీ ఏర్పాటు చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కర ఘాట్లతోపాటు జల్లు స్నానం చేసేందుకు షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఘాట్ల సమీపంలో స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పారిశుధ్యం పనుల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు.

మరిన్ని వార్తలు