లోక పావని.. పుష్కర వాహిని

26 Nov, 2020 04:25 IST|Sakshi
కర్నూలులోని పుష్కర ఘాట్‌లో భక్తుల సందడి

ఆరో రోజుకు చేరిన తుంగభద్ర పుష్కరాలు 

తుపాన్‌ హెచ్చరికలను సైతం లెక్క చేయక తరలివచ్చిన భక్తులు  

రాష్ట్ర ప్రజలకు ఐశ్వర్యసిద్ధి కోసం క్రతువు నిర్వహించిన వేద పండితులు

కర్నూలు (సెంట్రల్‌): లోక పావని.. పుష్కర వాహిని తుంగభద్రమ్మను భక్తి శ్రద్ధలతో అర్చించారు. దోషాలను కడిగేసే నదీమ తల్లికి పాలు, పన్నీరు.. పసుపు, కుంకాలు.. శ్రీగంధపు ధారలు.. పంచామృతాలను అర్పించి అభ్యంగన స్నానాలు ఆచరించారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 20న ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. వేకువజామునుంచే భారీగా తరలివచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి నదీమ తల్లికి వాయనాలు సమర్పించి దీవెనలు అందుకున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 23 ఘాట్లలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. తుపాను హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన యాత్రికులు మంత్రాలయం, సంగమేశ్వరం, గురజాల, కర్నూలులోని సంకల్‌భాగ్‌ ఘాట్లలో పుష్కర పూజలు నిర్వహించారు. పెద్దల అనుగ్రహం కోసం పిండ ప్రదానాలు చేశారు.  

ఐశ్యర్యాలు సిద్ధించాలని హోమం 
కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైన రోజు కావడంతో.. శ్రీ మహావిష్ణువుకు వేద సూక్తములతో నారాయణ క్రతువు నిర్వహించారు. ఈ హోమం వల్ల రాష్ట్ర ప్రజలకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, కల్యాణ యోగం కలుగుతుందని రవిశంకర్‌ అవధాని తెలిపారు. హోమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందారు. నివర్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి పుష్కర ఘాట్‌ వద్ద ఒక్కో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచింది. వీరితోపాటు పోలీసులు, ఆగ్నిమాపక, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, బోట్లు, రక్షణ కవచాలను అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక బృందాలు ఈ నెల 28 వరకు ఘాట్లలోనే ఉంటాయి. మరోవైపు పుష్కరాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్విరామంగా కొనసాగేందుకు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ నేతృత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు