తుని రైలు ఘటన: మరో 17 కేసులు ఉపసంహరణ

27 Jul, 2020 20:50 IST|Sakshi
ఫైల్ ‌ఫోటో

సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని రైలు ఘటనలో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌  సోమవారం జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు తెలిపారు. మొత్తం నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది.

మరిన్ని వార్తలు