Visakhapatnam: అలా నడిచేద్దాం.. మీన ప్రపంచంలోకి

6 Sep, 2021 23:31 IST|Sakshi

విశాఖలో టన్నెల్‌ అక్వేరియం నిర్మాణానికి చురుగ్గా సన్నాహాలు 

తొట్లకొండ అనుకూలమనినిర్ధారించిన అధికారులు 

పీపీపీ విధానంలో రూ. 163 కోట్లతో నిర్మాణానికి ప్రణాళికలు 

పర్యాటకులకు కనువిందు చేయనున్న 20 వేల రకాల జలచరాలు 

సాక్షి, విశాఖపట్నం: చిన్న అక్వేరియంలో అందమైన చేపల కదలికలను చూస్తేనే మనకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదే పెద్ద అక్వేరియంలోకి నడుచుకుంటూ వెళ్లి భారీ జలచరాల మొదలు చిన్న చిన్న జీవులను సమీపం నుంచి చూస్తే మనసు ఎంత పులకరిస్తుందో కదా! ఓ టన్నెల్‌ లాంటి అక్వేరియంలో జలచరాలను చూస్తూ అక్కడే విందు ఆరగిస్తుంటే మజా వస్తుంది కదా! అద్దాల అక్వేరియంలో ఇలాంటివన్నీ ఆస్వాదించడానికి ఇప్పుడు విదేశాలకు వెళ్లనక్కర్లేదు. మన రాష్ట్రంలో కూడా అలాంటి అద్దాల అక్వేరియంను నిర్మించడానికి ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.

దేశంలోనే మొట్టమొదటిదైన టన్నెల్‌ అక్వేరియంను సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.163 కోట్లతో విశాఖపట్నంలో పీపీపీ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్వేరియం నిర్మాణానికి విశాఖలోని రుషికొండ, తొట్లకొండ, మధురవాడ ప్రాంతాల్లో స్థలాల్ని పరిశీలించారు. అక్వేరియంకు ఎక్కువ సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో.. తొట్లకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు.

అద్భుత ప్రపంచం.. 
అక్వేరియం ఓ భారీ సొరంగం మాదిరిగా ఉంటే.. అందులో దాదాపు సముద్రంలో ఉండే జీవుల్నీ పెంచితే.. దాన్నే టన్నెల్‌ అక్వేరియం అంటారు. ఓసినేరియం మాదిరిగా ఇది ఓ అద్భుత ప్రపంచంలా ఉంటుంది. సముద్రలోతుల్లోకి వెళ్లి.. జలచరాల్ని సమీపం నుంచి చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. గుహలా ఉండే ఈ నిర్మాణంలోకి అడుగుపెట్టగానే.. జలచరాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్‌ మన మీదకు వచ్చేసినట్లే ఉంటుంది. షార్క్‌ల దంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆక్టోపస్‌ల జిత్తులు, సముద్రపు రొయ్యల దాగుడు మూతలు, భారంగా ఈదుతున్న తాబేళ్లు.. ఇలా పలు రకాల జలజీవాలను అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలోంచి 360 డిగ్రీల కోణంలోనూ చూడవచ్చు.

విశాఖలో నిర్మించే అక్వేరియంలో ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో కనిపించే  20 వేల రకాల సముద్ర జీవులు ఉండనున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, స్పెయిన్‌ దేశాలకు చెందిన నిపుణులు దీనిని డిజైన్‌ చేయనున్నారు. సుమారు 3 వేల మంది ఒకేసారి సాగర ప్రపంచాన్ని తిలకించేలా ఐదు అంతస్తుల్లో నిర్మాణం జరగనుంది. కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా.. వైజ్ఞానిక, పరిశోధన క్షేత్రంగానూ ఉపయోగపడేలా దీనిని నిర్మించాలని భావిస్తున్నారు.

విశాఖలో ఇవీ థీమ్స్‌..
 ఓషన్‌ థీమ్స్‌: హిందూ, పసిఫిక్‌ మహా సముద్రాల్లో మత్స్య సంపద, సుడిగుండాలు, ఉప్పెనల వల్ల సముద్రాలు ఎలా 
ప్రభావితమవుతాయి. స్థానిక వాతావరణం కారణంగా ఎలాంటి మార్పులు సంభవిస్తాయనే విషయాలు పర్యాటకులకు వివరించనున్నారు.  
► ఓడలు ఎలా మునిగిపోయాయి?: ప్రపంచంలో పలు సముద్రాల్లో భారీ ఓడలు ఎలా మునిగిపోయాయి. ఎలా ధ్వంసమయ్యాయో పర్యాటకులకు షిప్‌రెక్‌ థీమ్‌లో వివరించేలా నిర్మాణం జరగనుంది.


► భారతదేశ నదుల థీమ్‌: మనదేశంలో ఉన్న నదులు ఎక్కడ పుట్టాయి. ఎటు ప్రవహిస్తున్నాయి. సముద్రంలో ఎక్కడ కలుస్తాయన్నది ఇక్కడ చూపించనున్నారు.  
► టన్నెల్‌ రీఫ్‌ రెస్టారెంట్‌: టన్నెల్‌ అక్వేరియంలో సముద్ర జీవులను చూస్తూ.. హాయిగా భోజనం చేసేలా టన్నెల్‌ రీఫ్‌రెస్టారెంట్‌ ఏర్పాటు చేయనున్నారు. 
► షార్క్‌ ల్యాబ్‌: షార్క్‌(సొర) చేపల జీవన చక్రం, మానవ చర్యల కారణంగా అవి ఎలా అంతరించిపోతున్నాయన్నది ఈ ల్యాబ్‌లో చూపించనున్నారు. 
► మెడిటరేనియన్‌ కేవ్స్‌: అలల తాకిడికి సముద్రంలో శిలాతోరణాలు ఎలా ఏర్పడతాయో వివరించేలా నిర్మాణం జరగనుంది.

అద్భుతాల నిలయం.. విశాఖ అక్వేరియం 
సింగపూర్‌లోని మెరైన్‌ లైఫ్‌పార్క్, ఇంగ్లండ్‌లోని బౌర్న్‌మౌత్, లాస్‌ ఏంజిల్స్‌లోని సీవరల్డ్‌ తరహా టన్నెల్‌ అక్వేరియం విశాఖలో నిర్మించాలని భావిస్తున్నాం. టూరిజం పాలసీ 2020–2025ని అనుసరించి పీపీపీ విధానంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించాం. అద్భుతాలకు నిలయంగా ఇది రూపుదిద్దుకోనుంది. విభిన్న థీమ్స్‌తో పాటు గ్రీన్‌ ఫోటో ఫెసిలిటీ, సావనీర్‌ షాప్స్, ఫుడ్‌ కోర్టులు, అనేక సరికొత్త అందాలు టన్నెల్‌ అక్వేరియంలో మిళితమై ఉంటాయి. 
– రజత్‌ భార్గవ, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.

మరిన్ని వార్తలు