షార్‌లో విషాదం.. సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య

17 Jan, 2023 10:20 IST|Sakshi
షార్‌ వద్ద పోలీసుల బృందం

సాక్షి, సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. 24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం కలిగించింది. షార్‌ మొదటిగేటు వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌సింగ్‌ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకు­న్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్‌ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు.

ఎస్‌ఐ కాల్చుకోవడాన్ని చూసిన సిబ్బంది శ్రీహరికోట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ ఘటనా­స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్‌ రాడార్‌ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆది­వారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్‌ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మహషముండ్‌ జిల్లా శంకర విలేజ్‌ అండ్‌ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.

చింతామణి ఆత్మహత్య సమాచారం అందుకున్న సీఐ­ఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్నకన్నన్‌ శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. 

చదవండి: (వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు