రెండురోజులు కోస్తాంధ్రలో వర్షాలు

21 Apr, 2021 04:05 IST|Sakshi

రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కర్నూలు (అగ్రికల్చర్‌): నైరుతి మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాప్తి చెందుతోంది. ఉత్తర దక్షిణ తమిళనాడులో ఏర్పడిన ఆవర్తనం ఇప్పడు ద్రోణిగా మారి విస్తరిస్తోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల వరకు ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు.

రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.  కర్నూలు జిల్లాలో మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. పెనుగాలులు వీచాయి. పిడుగులు పడ్డాయి. సంజామల మండలం మిక్కినేనిపల్లిలో పిడుగుపడి షేక్‌ రజియా అలియాస్‌ రేష్మ (18) మృతిచెందింది. పెనుగాలులకు ఓర్వకల్లు, వెల్దుర్తి, బేతంచర్ల తదితర మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి.  

>
మరిన్ని వార్తలు