ఏపీ వాసులకు అలర్ట్‌.. రెండు రోజులు భారీ వర్షాలు

29 Aug, 2022 04:15 IST|Sakshi
శింగనమల చెరువు

సాక్షి, విశాఖపట్నం/అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్రంలో రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.  

పెద్దపప్పూరు, ధర్మవరాల్లో కుండపోత 
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఐదురోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో 15 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ప్రధాన వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి.

పదుల సంఖ్యలో చెరువులు నిండి మరువ పారుతున్నాయి. వందలాది చెరువుల్లోకి వరదనీరు చేరుతోంది. చిత్రావతి, స్వర్ణముఖి, పెన్నా తదితర నదుల పరీవాహక ప్రాంతాలు వరదతో పోటెత్తాయి. దాదాపు ఆరులక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉన్న ఖరీఫ్‌ పంటలకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు