నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు

17 Mar, 2021 03:44 IST|Sakshi

పురపాలక సంఘాలకు ఇద్దరు వైస్‌ చైర్మన్లు  

మునిసిపల్, నగర పాలక సంస్థల చట్టానికి త్వరలో సవరణలు  

ప్రజలకు మరింత మేలు చేసేందుకు సీఎం నిర్ణయం 

మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, పురపాలక సంఘాలకు ఇద్దరు వైస్‌ చైర్మన్లను ఎన్నుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ఆలోచన చేశారన్నారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో మునిసిపల్, నగర పాలక సంస్థల చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురాబోతున్నట్టు పెద్దిరెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల 18న చైర్మన్లు, మేయర్లు, వైస్‌ చైర్మన్లు..
డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందన్నారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ద్వారా రెండో వైస్‌ చైర్మన్, డెప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చైర్మన్లు, మేయర్ల పదవులను రెండున్నరేళ్ల పాటు పంపకాలు చేయబోతున్నారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అలాంటి ఆలోచనేది ప్రభుత్వానికి లేదన్నారు. మునిసిపాలిటీ, నగరపాలక సంస్థల్లో చైర్మన్, మేయర్‌ బాధ్యతలను ప్రతిరోజు కొంత సమయం ఇద్దరేసి చొప్పున ఉండే వైస్‌ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్టు చెప్పారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎస్‌ఈసీ పూర్తి చేయాలి
కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవాలను రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలన్న ఎస్‌ఈసీ ప్రయత్నాలకు హైకోర్టు చెక్‌ పెట్టిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కోరుతున్నామన్నారు. ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి ఆయన పదవీ విరమణ చేస్తే బాగుంటుందన్నారు. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తే యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు లభించిందనే విషయం పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్‌ ఫలితాలు అద్దం పడుతున్నాయన్నారు. 

తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తాం
తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 17న జరిగే ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఆ స్థానం తిరిగికైవసం చేసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఏకగ్రీవాలైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన పారితోషికాలను త్వరలోనే ఆయా పంచాయతీలకు విడుదల చేస్తామన్నారు. చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. సీఐడీలో పెండింగ్‌లో ఉన్న కేసులు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చారే తప్ప అందులో కక్ష సాధింపు చర్యలేముంటాయని ప్రశ్నించారు. ఇది పూర్తిగా డిపార్టుమెంటల్‌ ఎంక్వైరీ మాత్రమేనన్నారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఆర్‌డీఎ పరిధిలో చట్టవిరుద్దంగా అమ్మకాలు, అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌లో బీనామీ లావాదేవీలు జరిగాయని వారే ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టించాలని ప్రభుత్వం చూస్తోందనడంలో వాస్తవం లేదన్నారు.  

మరిన్ని వార్తలు