పోలీసుల అదుపులో ఇంటూరి బ్రదర్స్‌.. బైక్‌లకు పెట్రోలు  పోయించి మరీ..

6 Jan, 2023 15:13 IST|Sakshi

సాక్షి, నెల్లూరు/కందుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన దర్ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులు ఇద్దరిని హైదరాబాద్‌లో అదుపు­లోకి తీసుకున్నారు. గత నెల 28న ఇదేం ఖర్మ రాష్ట్రా­నికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కందుకూరులో పర్యటించారు.

ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎనిమిదిమంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితుడు పిచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రధాన నిందితులుగా ఉన్న టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వర­రావు, నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని కందుకూరు తీసుకొచ్చారు. 

లోతుగా దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు సీఆర్‌పీసీ 174 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. సభ జరిగిన ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా షూట్‌ చేసిన వీడియో విజువల్స్‌ సేకరించారు. అనుమతిలేకుండా బైక్‌ ర్యాలీ నిర్వహించేందుకు ప్రోత్సహించి స్థానిక పెట్రోలు బంకు వద్ద బైక్‌లకు పెట్రోలు  పోయించిన వివరాలు తీసుకున్నారు. సభకు జనాలను తరలించేందుకు వాహనాలు సమకూర్చి నగదు పంపిణీ చేసిన వివరాలు, సభకు వచ్చిన వారికి భోజనాలు, డీజే ఏర్పాటు చేసినవారి వివరాలు సేకరించారు.   కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్‌గా గుర్తించారు. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు
కందుకూరు ఘటనలో మృతిచెందిన వారిలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీలున్నారు. దీంతో పోలీసులు అదనంగా సెక్షన్‌ 304(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ సెక్షన్లను కలిపారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు