ఇద్దరు సాక్షి ఉద్యోగుల మృతి

23 May, 2021 02:41 IST|Sakshi

సాక్షి, దొండపర్తి (విశాఖదక్షిణ)/సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘సాక్షి’ దినపత్రిక ఉద్యోగులు ఇద్దరు శనివారం మృతి చెందారు. యాడ్స్‌ విభాగం ఏజీఎం అరుణ్‌కుమార్‌ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన పాతికేళ్లుగా ప్రధాన పత్రికల్లో యాడ్స్‌ విభాగంలో అనేక హోదాల్లో పనిచేశారు. సాక్షి దినపత్రిక ప్రారంభం నుంచి యాడ్స్‌ విభాగంలో పనిచేస్తూ ప్రస్తుతం ఏజీఎం హోదాలో ఉన్నారు. అరుణ్‌కుమార్‌ మృతి పట్ల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.

అలాగే, జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ చెన్నై కార్యాలయంలో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్‌ మేనేజర్‌గా పనిచేస్తోన్న ఎస్‌.రాధాకృష్ణన్‌ (51) శనివారం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు డయాలసిస్‌ చేసుకోవాలని వైద్యులు సూచించారు. చెన్నైలోని ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో అది సాధ్యపడలేదు. కొందరి సహకారంతో పుదుచ్చేరి ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్‌ తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా పరిస్థితి విషమించింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూశారు.  

మరిన్ని వార్తలు