సీఐడీకి రెండు స్కోచ్‌ జాతీయ అవార్డులు

1 Nov, 2020 03:41 IST|Sakshi

ఆపరేషన్‌ ముస్కాన్, ఈ–నిర్దేశ కార్యక్రమాలకు రజత పతకాలు

స్కోచ్‌ సెమీఫైనల్స్‌కు చేరిన మరో రెండు అవార్డులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి రెండు స్కోచ్‌ జాతీయ అవార్డులు వచ్చినట్టు అడిషనల్‌ డీజీ, ఏపీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ చెప్పారు. సీఐడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కోవిడ్‌–19, ఈ–నిర్దేశ కార్యక్రమాలకు రజత పతకాలు వచ్చినట్టు శనివారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► జాతీయ స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక వినియోగం, అత్యుత్తమ నూతన ఆవిష్కరణలకు ఏటా స్కోచ్‌ గ్రూప్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులను అందజేస్తుంది. 
► ఈ ఏడాది దేశ వ్యాప్తంగా టెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు 84 అవార్డులు అందజేయగా అందులో 48 అవార్డులు ఏపీ పోలీస్‌ శాఖకు దక్కడం గర్వకారణం. 
► ఏపీ పోలీస్‌ విభాగంలో వచ్చిన అవార్డుల్లో ఏపీ సీఐడీకి రెండు జాతీయ రజత పతకాలు రావడం విశేషం. జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన ఆన్‌లైన్‌ కార్యక్రమంలో సీఐడీ తరఫున రెండు రజత పతకాలు అందుకున్నాం. 
► సీఐడీ విభాగం అధ్వర్యంలో రూపొందించిన ఈ–నిర్దేశ, ఆపరేషన్‌ ముస్కాన్‌–కోవిడ్‌ 19 ప్రాజెక్టులకు రజత పతకాలు గెలుపొందగా ఏపీ సీఐడీ ‘ఫర్‌ ఎస్‌ ఫర్‌ యూ’, ఈ–రక్షాబంధన్‌’ కార్యక్రమాలు స్కోచ్‌ ఆర్డర్‌ అఫ్‌ మెరిట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. 
► శాంతి భద్రతల పరిరక్షణలో, కేసుల ఛేదింపు, వివిధ పోలీసింగ్‌ విధుల్లో టెక్నాలజీ వినియోగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. 
► వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు తోడు సైబర్‌ నేరాలు అదే స్థాయిలో సవాల్‌గా మారాయి. సైబర్‌ నేరాలను అదుపు చేయాలంటే అత్యున్నత స్థాయిలో మన టెక్నాలజీ వినియోగం, రూపకల్పనలు ఉండాలి. అటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న సీఐడీ విభాగం ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులను గెలుచుకోగలిగింది. 
► సీఐడీని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం.  

మరిన్ని వార్తలు