Guntur Accident: ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

19 Sep, 2022 13:03 IST|Sakshi

గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి జాతీయ రహదారిపై జరిగింది. గుంటూరు ఆర్‌వీఆర్‌ కళాశాలలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపాలెంకు చెందిన జె.ప్రవీణ్‌రెడ్డి(23) గుంటూరు రూరల్‌ మండలం రెడ్డిపాలెంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రెడ్డిపాలెంకు చెందిన టి.చందు (18) కూడా ఆర్‌వీఆర్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

వీరిద్దరూ ఆదివారం రాత్రి బైక్‌పై కాజ టోల్‌గేట్‌ వద్ద ఉన్న హోటల్‌కు వచ్చి భోజనం చేసి తిరిగి వెళ్తుండగా,  పెదకాకాని మండలం కంతేరు అడ్డరోడ్డు సమీపంలో ఎదురుగా వెళ్తున్న లారీని దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో లారీ వెనుకభాగం బైక్‌కు తగలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రవీణ్‌రెడ్డి, చందు తీవ్రంగా గాయపడ్డారు. ప్రవీణ్‌రెడ్డిని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి, చందును గుంటూరు రోడ్డులోని ఉదయ్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరో ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు  
జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. పెదకాకాని పల్లాలమ్మ చెరువు వద్ద ఆదివారం రాత్రి  గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో విజయవాడ  నుంచి గుంటూరు వైపు వెళుతున్న  గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని 108 సిబ్బంది తెలిపారు. క్షతగాత్రుని వద్ద ఎటువంటి ఆధారాలూ లభ్యం కాలేదని çపోలీసులు తెలిపారు.    

మరిన్ని వార్తలు