నెల్లిపట్ల.. కలిసెనిట్లా!

3 Sep, 2020 09:42 IST|Sakshi
ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళుతున్న గ్రామస్తులు

సాక్షి, పలమనేరు/బైరెడ్డిపల్లి: ఆ గ్రామంలో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత మూడు దశాబ్దాలుగా వర్గపోరు సాగుతూనే ఉంది. ఏటా గ్రామంలో జరిగే పండుగలు సైతం రెండు వర్గాలు వేర్వేరుగానే చేసుకునేవారు. ఈ రెండు వర్గాల మధ్య పోరు చాలాకాలం పాటు సాగింది. ఫలితంగా గ్రామంలో అనాదిగా సాగే మార్గసహేశ్వరస్వామి ఉత్సవాలు 32 ఏళ్లుగా జరగలేదు. అయితే గ్రామస్తులు, ఇరువర్గాల పెద్దమనుషులు, గ్రామ యువత ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కంకణం కట్టుకున్నారు. గత పదిరోజులుగా జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో గ్రామంలోని మార్గసహేశ్వురుని సాక్షిగా గ్రామం ఒక్కటైంది. సినిమాను తలపించేలా ఉన్న యదార్థ కథనం ఇది. బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
 
ఫలించిన ఇరువర్గాల పెద్దల కృషి
అడవికి ఆనుకుని ఉండే నెల్లిపట్ల చాలా పాత గ్రామం. ఈ గ్రామానికి తమిళనాడు రాష్ట్రం దగ్గరగా ఉంటుంది. తెలుగు, తమిళ సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ఆ మండలంలో ఇదే పెద్దపంచాయతీ. 1995లో రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరి ఊరు రెండుగా చీలింది. అప్పటినుంచి ఎన్నికల సమయంలో, జాతరలప్పుడు గొడవలు జరుగుతుండేవి. గ్రామంలో జరిగే అన్ని పండుగలు రెండు దఫాలుగా రెండు వర్గాలు జరుపుకునేవి. గత 32 ఏళ్లుగా ఇరువర్గాల మధ్య జరిగిన సంఘర్షణలు, ఎన్నో ఇబ్బందులు వారిలో కొత్త ఆలోచనలకు దారితీశాయి.

పాతతరం పెద్దలకు నేటి తరం యువత ఆలోచనలు కలిశాయి. గ్రామం బాగుపడాలంటే ప్రజలు సుఃఖసంతోషాలతో జీవించాలంటే గ్రామం ఒక్కటవ్వాలని భావించారు. దీంతో ఇరువర్గాలకు చెందిన పెద్దలు ఇంటికో మనిషిని రమ్మని ఇటీవల పంచాయతీ నిర్వహించారు. ఇకపై  ఎటువంటి వర్గాలు లేకుండా కలిసిపోదామని మూ కుమ్మడిగా తీర్మానించారు. గ్రామ సమపంలోని పట్నపల్లి కల్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రమాణాలు చేసుకున్నారు. దీంతో గ్రామం ఒక్కటైంది.

మార్గసహేశ్వరునికి సామూహిక పూజలు
పౌర్ణమి సందర్భంగా బుధవారం గ్రామంలోని అందరూ కలసిపోయారు. ఊరంతా కలసి మహిళలు కలశాలతో గ్రామంలోని మార్గసహేశ్వరుని ఆలయంలో సామూహిక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆగిపోయిన ఉత్సవాలను ఇకపై ఏటా కొనసాగించనున్నట్టు పెద్దలు తెలిపారు. గ్రామస్తులంతా కలసి సహపంక్తి భోజనాలు చేశారు. 

మరిన్ని వార్తలు