లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు 

18 Mar, 2021 04:52 IST|Sakshi
వీఆర్వో రేణుకారాణిని ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు

సాక్షి, అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు బి.వెంకటరమణకు ఈ–పట్టాటారు పాస్‌బుక్‌ ఇవ్వడానికి వీఆర్వో డి.రాజశేఖర్‌ రూ.8,500 లంచం అడిగాడు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ అధికారులు రాజశేఖర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్‌ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామ రైతు రాజేష్‌ పండకు ఈ–పట్టాదార్‌ పాస్‌బుక్, టైటిల్‌ డీడ్‌ ఇవ్వడానికి బోదరసింగి వీఆర్వో బి.రేణుకారాణి రూ.3వేలు లంచం అడిగారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా రేణుకారాణిని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ స్పెషల్‌ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు.   

మరిన్ని వార్తలు