మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి.. వీడియో వైరల్‌

7 Sep, 2022 15:01 IST|Sakshi
వదిన కమలను కర్రతో చావబాదుతున్న ఆడపడుచు జానకి 

సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం): అయ్యో.. వద్దు అని అరుస్తున్నా వారి మనసు కరగలేదు. కొట్టొద్దు.. కొట్టొద్దు అంటూ వేడుకున్నా వారు కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయి, సాటి మహిళ అని చూడకుండా ఇద్దరు మహిళలు తమ సొంత అన్న భార్యపై కర్కశంగా కర్రలతో దాడి చేశారు. బాధితురాలు ఎంతగా ఏడుస్తున్నా వదలకుండా పాశవికంగా కొట్టారు. రణస్థలం మండలం పిషిణి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిని చుట్టుపక్కల వారు వీడియో తీయడంతో అది వైరల్‌ అయ్యింది.

జేఆర్‌పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పిషిణి గ్రామానికి చెందిన రెడ్డి జానకి, కొత్తకోట్ల సుశీల, రెడ్డి నారాయణరావులు అన్నాచెల్లెళ్లు. నారాయణరావుకు భార్య కమల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. జానకి అవివాహితురాలు కావడంతో తండ్రితో కలిసి ఉంటోంది. పక్కనే వేరే ఇంటిలో నారాయణ రావు కుటుంబంతో ఉంటున్నారు. సుశీలకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోయింది.

ఇటీవల నారాయణరావు తండ్రి రామ్మూర్తి పిషిణి రెవెన్యూ పరిధిలో తన భూమిని రూ.70 లక్షలకు విక్రయించారు. వచ్చిన సొమ్మును కుమారుడికి ఇవ్వకుండా ఆడపడుచులే పంచుకున్నారు. గతంలో కూడా ఆస్తులు అమ్మినప్పుడు ఇలాగే జరిగింది. దీంతో వదిన, ఆడపడుచుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని కమల ఆడపడుచులతో తగాదా పడుతూ ఉంటుంది.   

గతంలోనూ.. 
కర్రతో కర్కశంగా దాడికి పాల్పడిన రెడ్డి జానకి వ్యవహారం గతంలోనూ వివాదాస్పదమే. 2020లో ఏకంగా జేఆర్‌పురం ఎస్‌ఐపైనే ఆమె కేసు పెట్టింది. అప్పుడు ప్రకృతి లే–అవుట్‌లో అన్నాచెల్లెళ్ల మధ్య భూ వివాదంలో ఎస్‌ఐ అశోక్‌బాబు తలదూర్చడం, ఆ సెటిల్మెంట్‌ వ్యవహారం అక్రమ సంబంధం ఆరోపణల వైపు దారి తీయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై అప్పటి సీఐ హెచ్‌.మల్లేశ్వరరావుకు జానకి ఫిర్యాదు చేయడంతో ఆ పంచాయతీ ఎస్పీ వరకు వెళ్లింది. అప్పట్లో ఎస్‌ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు కూడా. తాజా ఘటన నేపథ్యంలో గత పంచాయతీని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.

 
పోలీసుల అదుపులో నిందితులు

కేసు నమోదు.. 
ఉదయం జరిగిన ఈ ఘటనపై స్థానికులు 112 నంబర్‌కు ఫోన్‌ చేయడంతో జేఆర్‌పురం ఎస్‌ఐ రాజేష్‌ సంఘటన స్థలానికి 7.15కు వె ళ్లారు. బాధితురాలు క మలను 108లో శ్రీకాకు ళం రిమ్స్‌కు తరలించారు. నిందితులైన జానకి, సుశీలను అదుపులోకి తీసుకుని జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్యాయత్నంగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.   

ప్లాన్‌ ప్రకారమే.. 
గొడవల నేపథ్యంలో వదినపై దాడి చేయడానికి ఆడపడుచులు ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్తవారింటిలో ఉన్న సుశీలను ముందురోజే జానకి ఇంటికి పిలిచింది. నారాయణరావు ఉదయం ఐదున్నరకే ఒక పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిపోతారు. ఆయన పరిశ్రమకు వెళ్లిపోయాక ఉదయం 6.45 గంటలకు వదిన కమలపై ఇద్దరూ కలిసి కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు కట్టేసి మరీ కసి తీరా కొట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. వైరల్‌ అయిన వీడియోలోనే జానకి 24 సార్లు కర్రతో కొట్టినట్లు తెలుస్తోంది. వీడియో తీయకముందు ఎంతగా దాడి చేసిందోనంటూ స్థానికులు అనుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు