Two Years YS Jagan Ane Nenu: టార్చ్‌ బేరర్‌

29 May, 2021 20:27 IST|Sakshi

పథకాల అమలులో మానవీయ కోణం

సమస్యలకు వెంటనే స్పందించే గుణం

కోవిడ్‌ సంక్షోభంలో బాధ్యతాయుత స్కీమ్‌లు

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున​ సీఎం జగన్‌

వెబ్‌డెస్క్‌: వైఎస్​ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా  పాలన అనుభవం రెండేళ్లు. కానీ పథకాలు ప్రవేశ పెట్టడంలో.. ప్రజా రంజక పాలన సాగించడంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రజల మధ్య గడిపిన అనుభవంతో ప్రజల నాడి పట్టుకున్నారు, వాళ్ల అవసరాలేంటో తెలుసుకున్నారు. వారి అక్కర తీర్చడంలో ఓ అన్నలా అలోచించి..  ఓ సీఎంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశానికే టార్చ్‌ బేరర్‌గా మారారు. అందుకు ఉదాహరణ కరోనా సంక్షోభ సమయంలో ఆనాథ పిల్లల సమస్యలను గుర్తించడంలో ఆయన ముందు చూపు, వారిని ఆదుకోవడంలో ఆయన చూపిన ఆతృత ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 

మేనమామగా
కోవిడ్ మహమ్మారి ధాటికి ఎన్నో కుటుంబాలు చిద్రమైపోయాయి. ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. కానీ వీరందరి కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన చిన్నారులు. ఆ చిన్నారుల సమస్యను అందరి కంటే ముందుగా పసిగట్టి దానికో పరిష్కారమార్గం చూపి తనలోని మానవీయ కోణం చాటుకున్నారు సీఎం  జగన్‌. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీతో వారికి భరోసా కల్పించారు. వారికి ఉచితంగా చదువు చెప్పించి.. 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము వారికే దక్కేలా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతీ సభలో అక్కా చెల్లెమ్మలంటూ నోరారా మహిళలను పిలిచే  ముఖ్యమంత్రి జగన్‌... కోవిడ్‌ రక్కసికి బలైన అక్కా చెల్లెమ్మల పిల్లలకు మేనమామగా అసరా ఇచ్చారు.. తల్లిదండ్రులు లేని లోటు కొంతైనా పూడ్చేందుకు ప్రయత్నించారు.


జగన్‌ బాటలో ఇతర సీఎంలు
జగన్‌ సర్కారు నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. సీఎం జగన్‌ నిర్ణయం ప్రకటించిన కొద్ది కాలానికే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అదే బాట పట్టారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు , లేదా వారిలో ఒక్కరిని కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.  ప్రతీ విద్యార్థికి ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా వారికి 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,500 నగదు సాయం చేస్తామని ప్రకటించారు.

మిగిలిన దేశం కంటే ఒక రోజు ముందుండే కేరళ కూడా ఈ విషయంలో ఏపీ కంటే వెనుకే ఉండి పోయింది. సీఎం జగన్‌ నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే పినరయి విజయన్‌ కూడా ముందుకు వచ్చారు. కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలకు తక్షణ సాయంగా మూడు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో పాటు వారికి ఉచితంగా విద్య అందిస్తామని హమీ ఇచ్చారు. అనాథలైన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇక తమిళనాడు సీఎంగా ఇటీవలే పదవి పగ్గాలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌ రూ. 5,00,000 లక్షల సాయం ప్రకటించారు.

ఏపీ బాటలో కేంద్రం
ఆఖరికి కేంద్రం కూడా ఏపీ సీఎం జగన్‌ను అనుసరించక తప్పలేదు. కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్యను అందించడమే స్కాలర్‌షిప్‌ ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన వారి పేరిట రూ. 10 లక్షల కార్పస్‌ఫండ్‌  ఏర్పాటు చేస్తామంది. వారికి 23 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము అందిస్తామంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో పాటు అనాథ పిల్లల ఉన్నత విద్యకు విద్యారుణం, వడ్డీ కట్టనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.  

మరిన్ని వార్తలు