చిన్న మామయ్య లైంగికంగా వేధిస్తున్నాడు.. 

22 Mar, 2022 10:41 IST|Sakshi
అర్బన్‌ కార్యాలయంలోని ఫిర్యాదుల బాక్స్‌లో అర్జీలు వేస్తున్న అర్జీదారులు  

‘మా నాన్న అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు.. టెలికాలర్‌గా పనిచేసి అమ్మకు డబ్బులిస్తున్నాం.. అయినా భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు.. అమ్మ, ఆమె సోదరుడైన చిన్న మామ, తాత వేధిస్తున్నారు. చిన్న మామ చెప్పినట్లు వినకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్న చిన్న మామ నుంచి రక్షణ కల్పించాలి’.. స్పందనలోనగరానికి చెందిన అక్కాచెల్లెలు ఆవేదన. 

సాక్షి, నగరంపాలెం(గుంటూరు): రూరల్, అర్బన్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం స్పందన(గ్రీవెన్స్‌) కార్యక్రమం నిర్వహించారు. అర్బన్‌లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. అర్జీదారులు అర్జీలను పెట్టెలో వేశారు. రూరల్‌లో స్పందన సీఐ శ్రీనివాసరావు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. స్పందనలో అందిన కొన్ని ఫిర్యాదులు.. 

నగరంలోని ఓ ఏరియాలో ఉంటున్న హిజ్రా కొంత మంది మందు బాబులు, బ్లేడ్‌బ్యాచ్‌తో కలసి, రాత్రిళ్లు డబ్బులు కోసం బెదిరిస్తున్నట్లు ఓబులునాయుడుపాలెంలో ఉంటున్న కొందరు హిజ్రాలు ఆరోపించారు. సదరు హిజ్రా బస్టాండ్, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో దౌర్జన్యానికి పాల్పడుతుందని అర్జీలో పేర్కొన్నారు. సదరు హిజ్రా చేస్తున్న అరాచకాలకు వత్తాసుగా ఉండాలని, లేనిచో చనిపోయే ముందు తమ పేర్లు రాస్తానని బెదిరిస్తుందని, ఆ హిజ్రా నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. 

ఆంధ్రా లూథరన్‌ సంఘం ఎన్నిక కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్వహించారని, వారిపై చర్య తీసుకోవాలని ఏఈఎల్‌సీ కార్యదర్శి కిశోర్, ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్, కోశాధికారి కె.మోజెస్‌అర్నాల్డ్‌ పలువురు  పాస్టర్లతో కలసి అర్జీ అందించారు. సంఘంతో సంబంధంలేని వారితో ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ప్యానల్‌ను రద్దు చేసి పాత ప్యానల్‌ను కొనసాగించాలని విన్నవించారు.

కొత్త ఇంటి నిర్మాణం కోసం ఓ కన్‌స్ట్రక్షన్‌కు రూ.20 లక్షలు కాంట్రాక్టు ఇచ్చినట్లు ఆనందపేట మేకలవారివీధికి చెందిన ఎన్‌.బాలు తెలిపారు. గతేడాదిలో ఇంటి పనులు ప్రారంభించగా, విడతల వారీగా సుమారు రూ.17 లక్షలు చెల్లించాను. పనులు మొదలెట్టిన రెండు నెలలకే రెండు అంతస్థులు కూలిపోయింది. ప్రస్తుతం ఇల్లు కట్టించి ఇవ్వకపోగా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు.  

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు మోసగించారని వసంతరాయపురం వాసి చక్రవర్తి, లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన శివనాగచారి, పొన్నూరు రోడ్డుకి చెందిన కనకమహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఒంగోలుకి చెందిన ఇద్దరు పరిచయమై, ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌ గార్డెనర్‌గా, జిల్లా/ మండల సమన్వయకర్తలుగా ఉద్యోగాలు కల్పిస్తామంటే ముగ్గురం విడతల వారీగా వారికి రూ.3.75 లక్షలు చెల్లించాం. ఇద్దరిలో ఒకరు చిత్రపరిశ్రమలో పనిచేస్తానని, మరొకరు ప్రభుత్వ టెండర్లు నిర్వహిస్తామని నమ్మబలికారని, తమకు న్యాయం చేయాలని కోరారు.  

పదేళ్ల క్రితం తన కొడుకుకి ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తానంటే తెలిసిన వారికి రూ.3 లక్షలు ఇచ్చినట్లు ప్రకాశం జిల్లా కంభం వాసి ఏ మహేశ్వరరావు తెలిపారు. గతంలో అతడు ప్రకాశం జిల్లాలో పోలీస్‌ ఉన్నతాధికారుల కార్యాలయాల్లో పనిచేసే వాడని పేర్కొన్నారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిసిందని, తాను చెల్లించిన డబ్బులు ఇప్పించాలని అర్జీ అందించారు.

మరిన్ని వార్తలు