ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో యూఏఈ భారీ పెట్టుబడులు

19 Apr, 2021 04:04 IST|Sakshi

భారత్‌లో రూ.50,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం

వాటిని ఆకర్షించేందుకు ఏపీ ఈడీబీ కసరత్తు

సత్ఫలితాలనిస్తున్న సమావేశాలు

ఫుడ్‌ ప్రాసెసింగ్, కోల్డ్‌చైన్, లాజిస్టిక్‌ రంగాల్లో పెట్టుబడులకు యూఏఈ ఆసక్తి  

సాక్షి, అమరావతి: భారత్‌లోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ఆసక్తిగా ఉంది. దాదాపు రూ.50,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా సుమారు 2,00,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి యూఏఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఏపీ ఈడీబీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యూఏఈ ప్రతినిధులతో రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా ఏపీలో మెగా ఫుడ్‌ పార్కులు, లాజిస్టిక్స్, శీతల గిడ్డంగులు, కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ వంటి తదితరాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు యూఏఈ అంబాసిడర్‌ డాక్టర్‌ అహ్మద్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌బానా, యూఏఈ–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ షరాఫుద్దీన్‌ షరాఫ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు జుల్ఫీ రవ్జీ, రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్, ఏపీ ఈడీబీ సీఈవో జె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గణాంకాలతో వివరించారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో 150కిపైగా కంపెనీలు పాల్గొనగా.. 70 కంపెనీలు ఏపీలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తిని చూపాయి.

1,663 టన్నుల పండ్లు ఎగుమతి..
రాష్ట్రం నుంచి ఏటా సుమారు రూ.10,000 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులను యూఏఈ దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రంగాల ఉత్పత్తులను యూఏఈ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్లు ఏపీ ఈడీబీ తేల్చింది. ఇందులో పండ్లు, పప్పు దినుసులదే అత్యధిక వాటా. ఏటా మన రాష్ట్రం నుంచి యూఏఈకి 1,663 టన్నుల పండ్లు, పప్పు దినుసులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో రెడీ టూ ఈట్‌ లేదా శుద్ధి చేసిన ఆహార పదార్థాల విలువ రూ.45 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దీని తర్వాత అత్యధికంగా 10,945 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. అలాగే 177 టన్నుల కూరగాయలు, 421 టన్నుల చిరుధాన్యాలు, 19 లక్షల టన్నుల మాంసం ఎగుమతి అవుతున్నాయి.  

మరిన్ని వార్తలు