జైహింద్‌ స్పెషల్‌: ఈస్టిండియా కుటిల వ్యూహం

4 Aug, 2022 13:41 IST|Sakshi
స్నేహితుడితో ఉదయగిరి చివరి పాలకుడు అబ్బాస్‌ అలీఖాన్‌ - ఉదయగిరి నవాబుల వారసురాలు సయ్యద్‌ ఖాదరున్నీసా బేగం

అబ్బాస్‌పై దాదాగిరి తలొగ్గని ఉదయగిరి 

భారతావనిని దోచుకోవడంలో పాశ్చాత్యులు ఒకరిని మించి మరొకరు అన్నట్లు వ్యవహరించారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్నప్పటి నుంచే ఆక్రమణల పర్వం పతాక స్థాయికి చేరింది. జాగీరులను సొంతం చేసుకోవడానికి బ్రిటిష్‌ వాళ్లు పన్నిన కుట్రకు ఒక ప్రత్యక్ష నిదర్శనం ఉదయగిరి (నెల్లూరు జిల్లా) జాగీర్‌ ఆక్రమణ. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఉదయగిరి నవాబుల వారసురాలు సయ్యద్‌ ఖాదరున్నీసా బేగం సాక్షి ‘జైహింద్‌’తో  పంచుకున్న ఆనాటి జ్ఞాపకాలివి.
 
దోపిడీకొచ్చిన దొర!
‘‘అవి పందొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లు. భారతదేశంలో రాజ్యాలు, సంస్థానాలు, జాగీర్దార్ల మీద ఈస్ట్‌ ఇండియా కంపెనీ కన్ను పడటం మొదలైంది. ఒక్కొక్క సంస్థానాన్ని ఏదో ఒక నెపంతో కంపెనీ పాలనలోకి తీసుకోవడం అనే కుట్ర చాపకింద నీరులా ప్రవహిస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో ఉంది ఉదయగిరి దుర్గం. ఆ దుర్గం నవాబుల పాలనలో ఉండేది. జాగీర్దారుగా అబ్బాస్‌ అలీఖాన్‌ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో అంటే.. 1803లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉదయగిరి జాగీర్దారుతో ఒప్పందం కుదుర్చుకోడానికి వచ్చింది.
చదవండి: జైహింద్‌ స్పెషల్‌: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరఫున స్ట్రాటన్‌ అనే అధికారి వచ్చాడు. కంపెనీకి ఉదయగిరి జాగీర్‌ నుంచి ఏడాదికి 53 వేల రూపాయల పేష్కార్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. అంత డబ్బు కంపెనీకి చెల్లించడానికి అబ్బాస్‌ అలీఖాన్‌ అంగీకరించలేదు. అంతేకాదు.. వాళ్లతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఉద్దేశంతో ఐదువేలు మాత్రమే చెల్లించగలనని చెప్పాడు అలీఖాన్‌. స్ట్రాటన్‌ దొర చాలా వ్యూహాత్మకంగా అలీఖాన్‌ చెప్పిన ఆ ఐదువేల మొత్తానికి అంగీకరించాడు. ఆ ఒప్పందం 1837 వరకు కొనసాగింది.

‘కోటలో కుట్ర’ వదంతి!
అత్యంత లాభసాటి రాబడి ఉన్న ఉదయగిరి సంస్థానం మీద నుంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీ దృష్టి మరల్చనే లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ తర్వాత అనుకోకుండా ఒక ప్రచారం తలెత్తింది. ఆ ప్రచారాన్ని సద్దుమణగనివ్వకుండా ఈస్ట్‌ ఇండియా కంపెనీ జాగ్రత్త పడింది. అప్పుడు నెల్లూరు కలెక్టర్‌ పేరు స్టోన్‌హౌస్‌. ఉదయగిరి పాలకుడు అబ్బాస్‌ అలీఖాన్, అతడి కుమారులు స్టోన్‌హౌస్‌ను హత్య చేయడానికి పథకం రచిస్తున్నారనే వదంతి ఎలా పుట్టిందో తెలియదు, కానీ స్టోన్‌హౌస్‌ ఆ వదంతిని ఉపయోగించుకున్నాడు. స్టోన్‌ హౌస్‌ కుయుక్తితో ఈ పుకారుకి మరింత ఆజ్యం పోస్తూ మద్రాసు ప్రెసిడెన్సీకి ఉత్తరం రాశాడు. ఉదయగిరి కోటలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అభియోగం అందులో ఉంది. కుట్ర జరుగుతోందని, ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రిని సిద్ధం చేస్తున్నారని, అబ్బాస్‌ కుమారులే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నారనీ..’ రాశాడు.

నవాబు నిర్బంధం
వివాదాన్ని విచారించే నెపంతో కలెక్టర్‌ మరితంగా విషయాన్ని  క్లిష్టపరుస్తూ  70 మందిని అరెస్ట్‌ చేయించాడు, మరో 40 మంది మీద నేర విచారణ జరపాల్సిందిగా ఆదేశించాడు. ఇలా రకరకాలుగా జాగీర్దారుల కుటుంబీకులు, సమీప బంధువుల మీద అనేక రకాల కేసులు పెట్టి నానా విధాలుగా బాధలు పెట్టాడు కలెక్టర్‌. కొందరిని చెంగల్పట్టు జైల్‌లో, మరికొందరిని సైదాపేట జైల్‌లో బంధించారు. ఇంట్లో ఉన్న వారికి కానీ, జైల్లో ఉన్న వారికి కానీ ఒకరి సమాచారం మరొకరికి తెలియని స్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబం కకావికలమైంది.

ఆంగ్లేయుల మీద పోరాటం సాగించిన ఉదయగిరి దుర్గం చివరి పాలకుడు అబ్బాస్‌ అలీఖాన్‌ను చెంగల్పట్టు జైల్లో బంధించారు. ఆయన ఆంగ్లేయుల అధికారానికి తలవంచకుండా, వారి ఆధిపత్యాన్ని అంగీకరించకుండా, వారిచ్చిన ఆహారాన్ని స్వీకరించకుండా 21 రోజుల పాటు ఉగ్గబట్టి ప్రాణాన్ని ఆత్మార్పణం చేసుకున్నారు’’ అని తెలిపారు ఖాదరున్నీసా.

కలిసిమెలిసి ఉండేవాళ్లు
‘‘ఉదయగిరి జాగీర్దార్‌ కుటుంబానికి వారసుల్లో ఒకరైన అబ్దుల్‌ ఖాదర్‌ సాహెబ్‌ అఫ్ఫాన్‌ (ఛాబుదొర) మా పెద్ద తాతగారు. ఆయన 1953లో మరణించారు. ఆయనకు పిల్లల్లేరు. మమ్మల్ని ఆత్మీయంగా చూసేవారు. ఆయన ఉదయగిరి దుర్గానికి పాశ్చాత్యుల కారణంగా ఎదురైన కష్టాలను, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన అనేక ఘట్టాలను మాకు చెబుతుండేవారు. ఉదయగిరి కోట లోపల మసీదులు, ఆలయాలు ఉండేవి. హిందువులు– ముస్లిమ్‌లు తరతమ భేదాలు లేకుండా సోదరభావంతో మెలిగేవారు. మనమంతా భారతీయులం, తెల్లవాళ్లు  మనల్ని దోచుకుంటున్నారనే స్పృహ అందరిలో ఉండేది.

అప్పట్లో అది సుసంపన్నమైన జాగీరు కూడా. అలాంటి జాగీరుకు బ్రిటిష్‌ వాళ్ల దృష్టి పడినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడది పేరుకే కోట అన్నట్లుగా ఉంది. పరాకాష్టకు చెందిన ఇంగ్లిష్‌ దొరల అరాచకానికి ఆనవాలుగా మిగిలింది. మా పూర్వికులు ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు. అబ్బాస్‌ అలీఖాన్‌ తండ్రి హజ్రత్‌ ఖాన్‌ సాహెబ్‌ వలి ఉర్సు చేసుకుంటాం. మొహర్రమ్‌ నెలలో ఉదయగిరి దర్గా ఉరుసులో హిందువులు– ముస్లిమ్‌లు కలిసి పాల్గొంటారు’’ అని ఖాదరున్నీసా తెలిపారు.
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు