సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారు..

16 Feb, 2022 04:53 IST|Sakshi
ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇస్తున్న గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి

యురేనియం కార్పొరేషన్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఆవేదన

కడప అర్బన్‌: ‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఆఫీసులో, ఇంటి వద్ద అవమానించారు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణ్యం’ అని వైఎస్సార్‌ జిల్లా పులి వెందుల నివాసి, యురేనియం కార్పొరేషన్‌ ఉద్యోగి గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన కడపలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

‘గౌరవంగా జీవిస్తున్న సామాన్య కుటుంబం మాది. కానీ, సీబీఐ అధికారులు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పేరిట ఏడాదిగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆయన హత్య గురించి అందరికీ తెలిసినట్లుగానే మాకూ తెలిసింది. అయితే ఈ ఏడాదిలో విచారణ పేరిట నన్ను 22 సార్లు పిలిచారు. ఆరేడు సార్లు నోటీసులు ఇచ్చారు. మిగిలిన సందర్భాల్లో వాట్సాప్‌ కాల్‌ చేసి పిలిచారు. వ్యవస్థల పట్ల గౌరవం, నమ్మకంతో అన్నిసార్లూ వెళ్లాను. నాకు తెలిసిన విషయాలు చెప్పాను. కానీ సీబీఐ అదనపు ఎస్పీ రాంసింగ్‌ ఆయన చెప్పినట్లు చెప్పాలంటూ బెదిరిస్తూ భౌతికదాడి చేశారు.

హత్య జరిగిన రోజు ఉదయం నేను, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కలిసి శివశంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్లు, అనంతరం శివశంకర్‌రెడ్డితో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళ్లినట్లు,  అక్కడ శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఏదో మాట్లాడుకున్న ట్లు చెప్పాలంటున్నారు. నేను ఆ రోజు ఉదయం ఎక్కడికీ వెళ్లలేదు. సురేంద్రనాథ్‌రెడ్డిని, శివశంకర్‌రెడ్డిని కలవలేదు. గంగిరెడ్డి ఇంటికి కూడా వెళ్లలేదు.

చేయని పని చేసినట్టుగా చెప్పలేను. ఇదే విషయాన్ని రాంసింగ్‌కు ప్రతిసారీ చెబుతున్నాను. కానీ ఆయన చెప్పినట్లు చెప్పకపోతే నన్నూ, నా కుటుంబాన్ని ఈ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నారు. శనివారం బ్యాంక్‌ అకౌంట్స్‌ పేపర్లు ఇచ్చా ను. సోమవారం కూడా పిలిపించారు. వారు చెప్పినట్టు చెప్పకపోతే మా నాన్నను ఈ కేసులో ఇరికిస్తానని బెదిరించారు.   కుటుంబమంతా ఆందోళనలో ఉన్నాం. మీరు వెంటనే విచారించి నిజానిజాలు తెలుసుకొని, రాంసింగ్,  సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అని అదనపు ఎస్పీని కోరారు. 

మరిన్ని వార్తలు