ఉద్దానం స్కందఫలం.. ఉత్తరాదికి వరం

15 Mar, 2022 20:41 IST|Sakshi

ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి

రోజుకు 40 టన్నులు సరఫరా

శ్రీకాకుళం జిల్లాలో 25 వేల హెక్టార్లలో సాగు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానపు ప్రాంత ఉద్యాన పంటలకు అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ లభిస్తుంటుంది. అద్భుతమైన రుచితో పండే ఇక్కడి ఉత్పత్తులకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువ. ముఖ్యంగా సీజనల్‌గా పండే పనస (స్కంద) పంట ఉత్తరాది ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతూ రైతుకు సిరులు కురిపిస్తోంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో పూతకు వచ్చే ఈ పంట ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి మధ్య నుంచే కాయలు దిగుబడి రావడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. 

పనసకాయలతో పకోడి..
పండుగలు.. సాధారణ రోజుల్లోనూ పనసకాయలతో చేసే పకోడిని ఇష్టంగా ఆరగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పనసతో పచ్చళ్లు, కూరలు, గూనచారు తయారు చేస్తారు. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు రోజుకు 40 టన్నుల వరకు పనసకాయలు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కేజీ పనసకాయ రూ.20 నుంచి రూ. 25 వరకు ధర పలుకుతోంది. మే నెల వరకు భారీ ఎగుమతులు జరుగుతాయి. 

తిత్లీ తుఫాన్‌ సమయంలో పనస చెట్లు విరిగిపోవడంతో నాలుగేళ్లుగా అంతంతమాత్రంగానే దిగుబడి వచ్చింది. జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లలో పనసకాయలు పండిస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, నందిగాం తదితర మండలాల్లో వీటి సాగు ఎక్కువ. 

వివిధ వంటకాలు..
పనస ముక్కల బిర్యానీ, పొట్టు కూర, హల్వా, పొట్టు పకోడీ, గింజల కూర, గూనచారు, కుర్మా, ఇడ్లీ, పచ్చళ్లు, బూరెలు వంటి విభిన్న రకాల ఆహార పదార్థాలు పనసకాయలతో చేస్తారు.

ఆదాయం ఘనం..
ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో పనసకాయల దిగుబడి ఎక్కువ. ఒక్కోచెట్టు నుంచి ఏడాదికి రూ. 800 నుంచి రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. కేవలం పొలంగట్లపై  చెట్లు వేసుకుంటేనే ఏడాదికి రూ.10 వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు.  
– జె.సునీత, ఉద్యానవన అధికారి, పలాస

మరిన్ని వార్తలు