ఉగాదికి తెలుగు లోగిళ్ల ముస్తాబు

2 Apr, 2022 09:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొననున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.50 గంటల వరకు ఉగాది కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

వివిధ వేద పాఠశాలల విద్యార్థుల మంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలుకుతారు. 10.42 గంటలకు పంచాంగ శ్రవణం అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉగాది క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగకర్తలతో పాటు వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులను సీఎం సన్మానించనున్నారని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ తెలిపారు.   

అన్ని జిల్లాల్లో అర్చకులు, వేద పండితులకు సన్మానం
ఉగాది పండుగ సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులతో పాటు వేద పండితులను ఘనంగా సన్మానించనుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో 62 ఏళ్లకు పైబడిన ముగ్గురు ఆర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతలకు రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలను కలెక్టర్ల చేతుల మీదుగా అందజేస్తారు. ఇందుకు గాను దేవదాయ శాఖ ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. మరో వైపు రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఆ సందర్భంగా ఆ సమీపంలో ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే ఇద్దరు అర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించాలని దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. 

చదవండి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని..

మరిన్ని వార్తలు