పోలీసులకు ఉగాది పురస్కారాలు

13 Apr, 2021 04:59 IST|Sakshi

ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరికి సీఎం శౌర్య పతకాలు 

పోలీస్, ఫైర్, ఏసీబీ, విజిలెన్స్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాలకు పతకాలు 

2020, 2021 అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: పోలీసు శాఖలోని పలు విభాగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వారికి ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ప్రకటించింది. 2020, 2021 ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోం) కుమార్‌ విశ్వజిత్‌ సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర పోలీస్, ఫైర్‌ సర్వీసెస్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు పతకాలను ప్రకటించారు. ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని ఇద్దరికి ప్రత్యేకంగా ప్రకటించగా, మరో నాలుగు విభాగాల్లో పతకాలను ఇవ్వనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.500 చొప్పున, ఒకేసారి రూ.10 వేల నగదు అందిస్తారు. పోలీస్, ఫైర్‌ సర్వీసెస్‌ మహోన్నత సేవా పతకం కింద నెలకు రూ.125, ఒకేసారి రూ.6 వేల నగదు అవార్డుగా ఇస్తారు. పోలీస్, ఫైర్‌ సర్వీసెస్‌ ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.100, ఒకేసారి రూ.5 వేల నగదు పారితోషకాన్ని అందిస్తారు. ఏపీ పోలీస్‌ కఠిన సేవా పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.100, ఒకేసారి రూ.4 వేల నగదు అందిస్తారు. ఏపీ పోలీస్, ఫైర్‌ సర్వీసెస్‌ సేవా పతకం కింద నెలకు రూ.75, ఒకేసారి రూ.4 వేలు ఇస్తారు. 

2020 ఉగాది పురస్కారాలకు ఎంపికైన వారు 
పోలీస్‌ శాఖలో మహోన్నత సేవా పతకానికి విజయవాడ సీఐడీ ఎస్‌ఐ సీహెచ్‌ శ్రీనివాసరావు, విజయనగరం ఆర్‌ఎస్‌ఐ వైఎస్‌ భూషణరావు, విజయవాడ ఇంటెలిజెన్స్‌ ఏఆర్‌ ఎస్‌ఐ ఎస్‌.వెంకటేశ్వరరావుతోపాటు 37 మంది ఎంపికయ్యారు. కఠిన సేవా పతకానికి 30 మంది, సేవా పతకానికి 160 మందిని ఎంపిక చేశారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సులో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 15 మందిని ఎంపిక చేశారు. ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌ ఉత్తమ సేవా పతకానికి ఇద్దరు, సేవా పతకానికి 25 మందిని ఎంపిక చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో మహోన్నత సేవా పతకానికి విజయవాడలో పనిచేస్తున్న సీహెచ్‌ రవికాంత్, ఉత్తమ సేవా పతకానికి 13 మందిని ఎంపిక చేశారు. 

2021 పురస్కారాలు ఇలా.. 
పోలీస్‌ శాఖలో మహోన్నత సేవా పతకానికి తిరుమల ఏఎస్పీ ఎం.మునిరామయ్య, మంగళగిరి 6వ ఏపీఎస్‌పీ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సీహెచ్‌వీవీ మల్లికార్జునరావు, అనంతపురం డీఎస్పీ ఎన్‌.మురళీధర్‌ ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి 37 మంది, కఠిన సేవా పతకానికి 30 మంది, పోలీస్‌ సేవా పతకానికి 161 మంది ఎంపికయ్యారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సులో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 8 మంది ఎంపికయ్యారు. ఏసీబీలో మహోన్నత సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 12 మంది ఎంపికయ్యారు. ఫైర్‌ సర్వీసెస్‌లో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 25 మంది ఎంపికయ్యారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉత్తమ సేవా పతకానికి 11 మంది ఎంపికయ్యారు.  

ధర్మాడి సత్యంకు పౌర విభాగంలో శౌర్య పతకం 
రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్తూ కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీయడంలో విశేష కృషి చేసిన ధర్మాడి సత్యం(కాకినాడ)కు పౌర విభాగం నుంచి ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. విజయవాడ బందరు కాలువలో మునిగిపోయిన బాలికను రక్షించిన రిజర్వ్‌ ఎస్‌ఐ అర్జునరావుకు కూడా ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని ప్రకటించారు.   

మరిన్ని వార్తలు