Uma Telugu Traveller: తెనాలి కుర్రోడు.. తగ్గేదే లే.. చదివింది 8.. నెలకు రూ.3లక్షలకుపైనే..

2 Jan, 2022 07:56 IST|Sakshi

కలల మార్గంలో సాహస ప్రయాణం

రూపాయి లేకున్నా 20 దేశాల్ని చుట్టి వచ్చిన యూట్యూబ్‌ వ్లాగర్‌ 

ఇప్పుడు నెలకు రూ.3 లక్షలకు పైగా సంపాదన

18 నెలల్లో 340 వీడియోల రూపకల్పన

7 లక్షల ఫాలోవర్లతో ‘ఉమా తెలుగు ట్రావెలర్‌’ 

8 ఏళ్లలో 197 దేశాలను చుట్టి రావాలనే ఆశయంతో ముందుకు 

అతడో యూట్యూబ్‌ వ్లాగర్‌. 8వ తరగతిలోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడు. ఫ్యాన్సీ షాపులో పని చేస్తూ రోజుకు రూ.20 సంపాదించేవాడు. నెలకు రూ.30 వేలు వస్తాయని తెలిసి దక్షిణాఫ్రికాకు ప్రయాణం కట్టాడు. ఆ వచ్చే రూ.30 వేలలో రూ.20 వేలు ఇంటి అద్దెకు ఖర్చయిపోయేవి. తినీ, తినక రోజులు గడిపాడు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ కలల మార్గంలో సాహస ప్రయాణం చేశాడు. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు విన్నాడు. చేతిలో రూపాయి లేకపోయినా 20 దేశాల్ని చుట్టి వచ్చాడు. వెళ్లిన ప్రతిచోటా అక్కడి విశేషాలతో కూడిన వీడియోలు తీసి ‘ఉమా తెలుగు ట్రావెలర్‌’ పేరిట యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ వచ్చాడు. ఆ వీడియోలు నచ్చటంతో అతడి చానల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు చేరారు. ఇప్పుడు అదే చానల్‌ ద్వారా అతడు నెలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు. 

తెనాలి: ‘ఉమా తెలుగు ట్రావెలర్‌’.. మాలెంపాటి ఉమాప్రసాద్‌ అనే 33 ఏళ్ల యువకుడు నడుపుతున్న యూట్యూబ్‌ చానల్‌ పేరిది. కేవలం 18 నెలల్లో ఆఫ్రికా, మధ్య ఆసియాలోని 20 దేశాలను చుట్టేసి.. ఆయా దేశాల్లోని గ్రామాలు, అక్కడి గిరిజన జాతుల జీవన స్థితిగతులు, ఆహార, ఆచార, వ్యవహారాలపై తీసిన 340 వీడియోలతో 7 లక్షల ఫాలోవర్లు, 115 మిలియన్ల వ్యూస్‌ సాధించాడు. ఎనిమిదేళ్లలో 197 దేశాలను చుట్టి, అక్కడి వింతలు, విశేషాలను తెలుగు ప్రజలకు అందించాలనే ఏకైక ఆశయంతో పయనిస్తున్న తెనాలి కుర్రోడి విజయ గాథలోకి తొంగిచూస్తే..

చదువు మానేసి.. ఫ్యాన్సీ షాపులో పనిచేసి.. 
కృష్ణా జిల్లా మూలపాలెంలో ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన మాలెంపాటి రామశేషయ్య, నాగమల్లేశ్వరి దంపతుల ముద్దుల తనయుడు ఉమాప్రసాద్‌. రెండేళ్ల వయసులోనే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. దీంతో ఉమాప్రసాద్‌ కుటుంబం తల్లి నాగమల్లేశ్వరి పుట్టినిల్లయిన తెనాలి సమీపంలోని బూతుమల్లికి వచ్చేసింది. తెనాలిలోని ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో 8వ తరగతి వరకు చదివిన ఉమాప్రసాద్, అంతటితో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడు. కుటుంబానికి సాయపడేందుకు ఫ్యాన్సీ షాపులో రోజుకు రూ.20 కూలితో పనిలో చేరాడు. 6 నెలల తరువాత తెనాలి ఆర్టీసీ బస్టాండ్‌లోని సైకిల్‌ స్టాండ్‌లో రూ.1,500 వేతనంతో పనికి కుదిరాడు. అక్కడా కొద్దిరోజులే పనిచేశాడు. ఆ తరువాత ఓ మెస్‌లోను, నిర్మాణ కంపెనీలోను, చెన్నై, హైదరాబాద్, అసోంలో రకరకాల పనుల్లో గడిపాడు. చివరకు సెక్యూరిటీ కంపెనీలో రూ.18 వేల జీతానికి చేరాడు. నాలుగేళ్లకు జీతం రూ.25 వేలకు చేరుకుంది.

రూ.లక్షన్నర పోగేసి.. 
ప్రపంచ దేశాలను చుట్టి రావాలనేది ఉమాప్రసాద్‌ కల. కొంచెం ఖాళీ దొరికితే చాలు యూట్యూబ్‌లో ట్రావెల్‌ వీడియోలు చూస్తుండేవాడు. తన కలను నెరవేర్చుకునేందుకు 2018 నాటికి రూ.1.50 లక్షలు పోగేసుకున్నాడు. తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని తొలిసారిగా నేపాల్‌ వెళ్లాడు. స్కూటర్, మోటార్‌ సైకిల్, లారీ.. ఇలా ఏది కనబడినా లిఫ్ట్‌ అడిగి మరీ నేపాల్‌ చేరుకున్నాడు. అక్కడ జర్మనీ టూరిస్ట్‌ జంటతో పరిచయం పెంచుకున్నాడు. తగిన సంపాదన లేకుండా ప్రపంచ యాత్ర చేయడం కష్టమని, తిరిగి వెళ్లిపొతే మంచిదని ఆ జంట చెప్పడంతో డీలా పడిపోయాడు.

తిరిగి స్వదేశానికి రాగా.. సెక్యూరిటీ కంపెనీలో ఉద్యోగం పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు. మరోవైపు నిలకడ లేనోడని బంధుమిత్రులు సూటిపోటి మాటలతో ఆడిపోసుకునేవారు. బంధువుల్లో ఒకరు దక్షిణాఫ్రికాలోని మాలిలో ఉద్యోగం ఉందని.. నెలకు రూ.30 వేలు జీతం ఇస్తారని చెప్పటంతో 2019లో మాలి చేరుకున్నాడు. అక్కడ వాటర్‌ ప్లాంట్‌లో పనిచేస్తూ ప్రపంచయాత్ర చేసే మార్గాలను అన్వేషించసాగాడు. ఏడాది తర్వాత 2020 మార్చి 22న స్వదేశానికి వచ్చేయాలనుకున్నాడు. సరిగ్గా అదే రోజు ఇండియాలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. చేసేదిలేక మాలిలోనే ఉండిపోయాడు.  

కలల బీజం నాటింది అమ్మే 
తన యాత్రకు కొంత విరామం ఇచ్చి సొంతూరికి వచ్చిన ఉమాప్రసాద్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రపంచ యాత్ర చేయాలనే తన కలకు బీజం వేసింది తన తల్లి నాగమల్లేశ్వరి అని చెప్పాడు. తన తల్లి ఉన్నత చదువులు చదవడంతో ఆమెకు జియోగ్రఫీ మేగజైన్లు, ఇంగ్లిష్‌ సినిమాలపై ఆసక్తి ఉండేదని.. వాటిని తల్లి తనకు కూడా పరిచయం చేసిందని చెప్పాడు. 19 ఏళ్లకే పెళ్లి చేసి, ప్రపంచ దేశాల విహారానికి పంపాలని తల్లి నాగమల్లేశ్వరి భావించారని.. ఆరి్థక పరిస్థితులు దెబ్బతినటంతో పెళ్లి సంగతటుంచి తానే సంపాదించాల్సి వచి్చందని చెప్పాడు. మాలిలో ఉద్యోగం చేయడం ద్వారా తన కలలకు ఓ రూపం వచ్చిందని, త్వరలోనే మళ్లీ తన యాత్రను పునఃప్రారంభిస్తానని ఉమాప్రసాద్‌ చెప్పాడు. ప్రపంచంలోని 197 దేశాలను చుట్టివచ్చి అక్కడి విశేషాలను తెలుగు ప్రజలకు అందించాలనేది తన ఆశయమని చెప్పాడు. 

అక్కడే మలుపు తిరిగింది..
మాలిలోనే ఉండే నీ కల నెరవేర్చుకోవచ్చు కదా అని స్నేహితులు చెప్పడంతో ఉమాప్రసాద్‌ ఆలోచించాడు. వారి ప్రోత్సాహంతో ప్రణాళికలు రచిస్తుండగా.. అతడి సెల్‌ఫోన్‌ కిందపడి పూర్తిగా దెబ్బతింది. ఉమా ఆసక్తిని గమనించిన వాటర్‌ ప్లాంట్‌ యజమాని ఇచి్చన రూ.30 వేలతో మే నెల 22న స్మార్ట్‌ ఫోన్, రూ.130తో సెల్ఫీ స్టిక్‌ కొన్నాడు. ఆ రోజే అతడి జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇండియాలో సాగయ్యే కూరగాయల్ని పండిస్తున్న ఆఫ్రికా వాసి మూసాతో తొలి వీడియో తీశాడు. ‘ఉమా తెలుగు ట్రావెలర్‌’ పేరుతో యూట్యూబ్‌లో వ్లాగ్‌ (వీడియోతో కూడిన బ్లాగ్‌) క్రియేట్‌ చేసి అప్‌లోడ్‌ చేశాడు. అలాగే వరుసగా 14 వీడియోలు పెట్టాడు. ఫాలోవర్లు 800 మంది వచ్చారు. ఆఫ్రికాలోని స్ట్రీట్‌ ఫుడ్‌పై తీసిన 15వ వీడియోతో అతడి జీవితం మారిపోయింది. జూన్‌ 1నుంచి అతడి వ్లాగ్‌కి విపరీతంగా ట్రాఫిక్‌ పెరిగింది. రోజుకు 15 వేల మంది ఫాలోవర్లను రికార్డు చేసింది. అదే అతడిలో ఆత్మవిశ్వాసం పెంచింది. కట్‌ చేస్తే ఏడాదిన్నర వ్యవధిలో దక్షిణాఫ్రికా, మధ్య ఆసియాలోని టాంజానియా, కెన్యా, ఉగాండా, జాంబియా, రష్యా సహా 20 దేశాలను సందర్శించాడు ఉమా ప్రసాద్‌. ఆ అభిరుచి ప్రస్తుతం యూట్యూబ్‌ చానల్‌ ద్వారా నెలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయాన్ని అతడికి తెచ్చిపెడుతోంది.  

>
మరిన్ని వార్తలు