భళా భరద్వాజ్‌.. అమెరికాలో తెలుగు విద్యార్థి అద్భుత ప్రతిభ

20 Jul, 2021 09:59 IST|Sakshi

ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలో మొదటిసారిగా యూఎంకేసీ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం

స్వర్ణ పతకమూ అందించిన అమెరికా వర్సిటీ

ఎనిమిది సంస్థలతోపాటు నాసా ఉపకార వేతనాలు

సీలేరు:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఆణిముత్యం ఖగోళ శాస్త్ర పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అమెరికాలో ప్రత్యేక గుర్తింపు సాధించి మాతృదేశం గర్వించేలా పేరు తెచ్చుకున్నాడు. అతనే విశాఖ జిల్లా సీలేరులోని ఏపీ జెన్‌కో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ కామేశ్వర శర్మ కుమారుడు భరద్వాజ్‌. హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసి, విజయవాడలోని కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్, కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాడు. 2014లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు.

అక్కడ యూఎంకేసీలో నిర్వహించిన అర్హత పరీక్షలో భరద్వాజ్‌ ప్రథమస్థానం సాధించి పరిశోధనలకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు శాస్త్ర పరిశోధనలు చేశాడు. విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి భరద్వాజ్‌ పరిశోధనలు చేశాడు. దీంతో ఖగోళ భౌతిక శాస్త్రంలో అతని అపూర్వ పరిశోధనను గుర్తించి యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తమ కుమారుడి పరిశోధనలకు వచ్చిన గుర్తింపుపై సోమవారం భరద్వాజ్‌ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. 

గోల్డ్‌ మెడల్, ప్రశంసా పత్రంతో భరద్వాజ్‌

ఖగోళ భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి డాక్టరేట్‌
ఖగోళ భౌతిక శాస్త్రంలో యూఎంకేసీ యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి డాక్టరేట్‌ సాధించిన వ్యక్తి భరద్వాజ్‌ అని వారు తెలిపారు. తమ కుమారుడి కృషివెనుక ప్రొఫెసర్‌ డానియేల్‌ మాకింటోస్, మార్క్‌ బ్రాడ్‌విన్‌ ప్రోత్సాహం ఎంతో ఉందని, ఈ పరిశోధనల సమయంలో ఎనిమిది సంస్థల నుంచి ఉపకార వేతనాలు లభించాయని వారు చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ్‌ కొనసాగిస్తున్న మరో పరిశోధనకు అమెరికాలోని నాసా ఉపకార వేతనం కూడా అందించనుందన్నారు. భరద్వాజ్‌ పరిశోధనలు మెచ్చి 2018లో అమెరికన్‌ అస్ట్రోనామికల్‌ సొసైటీ స్వర్ణ పతకం అందజేసిందని, భారత్‌కు తిరిగొచ్చి దేశంలోని విద్యార్థులకు భౌతికశాస్త్రంపై ఆసక్తి పెంచుకునేలా చేయడమే అతని ధ్యేయమన్నారు. భరద్వాజ్‌ మాట్లాడుతూ.. ఈ డాక్టరేట్‌ను స్ఫూర్తిగా తీసుకుని పోస్టు డాక్టరేట్‌ కూడా చేయనున్నట్లు తెలిపారు. 

పరిశోధనల అనంతరం స్వదేశానికి వచ్చిన భరద్వాజ్‌తో తల్లిదండ్రులు, సోదరి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు