‘పోలవరం’ క్రెడిట్‌ వైఎస్‌దే

23 Dec, 2020 03:55 IST|Sakshi

మాజీ ఎంపీ ఉండవల్లి 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆ రోజు ఆయన పూనుకోకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ అయ్యేది కాదన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ నిర్మాణం చేపడితేనే పుష్కలంగా నీరు నిల్వచేసే అవకాశం ఉంటుందని వైఎస్‌ ఆలోచన చేశారన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి కాకపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. గోదావరిపై  తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవని, దీనిపై గత చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించలేదని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పార్టీలను కలుపుకుని పార్లమెంట్‌లో ఒత్తిడి తేవాలని కోరారు.

విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం జాతీయ ప్రాజెక్ట్‌ను కేంద్రమే పూర్తిగా నిర్మించాల్సి ఉండగా.. నీతి ఆయోగ్‌ మాత్రం 70 శాతం నిధులను కేంద్రం, 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సిపార్సు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టంలో ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ అంటే భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఉన్నాయన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పోలవరం నిర్మాణానికయ్యే మొత్తం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా.. రూ.7 వేల కోట్లు  ఇవ్వాల్సి ఉందని కేంద్రం ప్రకటించడం అన్యాయమన్నారు. పునరావాసానికి రూ.22 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు.  బీజేపీ లో చేరాలనుకునే వారు వినయ్‌ సేతుపతి రచించిన జుగల్బందీ లేదా బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ పుస్తకం చదివి నిర్ణయం తీసుకోవాలన్నారు.  

మరిన్ని వార్తలు