స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టుకు అనూహ్య స్పందన

11 Apr, 2021 03:29 IST|Sakshi

ఆదివారం నాటికి 2,32,369 ప్లాట్ల కోసం డిమాండ్‌

ప్రజల కోరికపై డిమాండ్‌ సర్వే ఈ నెల 20 వరకు పొడిగింపు 

సర్వే పూర్తయ్యాక స్మార్ట్‌టౌన్లపై పురపాలక శాఖ తుది అంచనా

ఆ తర్వాతే భూసేకరణ

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్‌ సర్వేనే అందుకు నిదర్శనం. ఈ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్‌ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్‌ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

ఊహించిన దానికంటే అధికంగా డిమాండ్‌
స్మార్ట్‌టౌన్ల పట్ల రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజల నుంచి ఊహించిన దానికంటే భారీ డిమాండ్‌ వ్యక్తమవుతోంది. డిమాండ్‌ సర్వేకు చివరి రోజు అని ముందుగా ప్రకటించిన ఒక్క ఆదివారమే ఏకంగా 74 వేల ప్లాట్లకు ప్రజల నుంచి సుముఖత వ్యక్తం కావడం విశేషం. 
► ఒక్కోటి 150 చ.గజాల విస్తీర్ణం ఉండే 76,018 ప్లాట్ల కోసం ఆసక్తి వ్యక్తమైంది. 
► ఒక్కోటి 200 చ.గజాల విస్తీర్ణం ఉండే 77,247 పాట్ల కోసం సానుకూలత చూపారు.
► 240 చ.గజాల విస్తీర్ణం ఉండే 79,104 ప్లాట్ల కోసం ఆసక్తి చూపారు. 

డిమాండ్‌ సర్వే పొడిగింపు
వరుస సెలవులు రావడంతో డిమాండ్‌ సర్వేను పొడిగించాలని పలువురు పురపాలక శాఖను కోరారు. దీంతో సర్వేను ఈ నెల 20 వరకు పొడిగించినట్టు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌ వి.రాముడు తెలిపారు. 

డిమాండ్‌ సర్వే అనంతరం తదుపరి కార్యాచరణ
డిమాండ్‌ సర్వే పూర్తి చేశాక స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టుపై పురపాలక శాఖ తుది అంచనాకు వస్తుంది. దాని ప్రకారం భూసేకరణ నిర్వహిస్తారు. అనంతరం నోటిఫికేషన్‌ జారీ చేసి ప్లాట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, నిబంధనలు, ప్లాట్ల కేటాయింపు విధివిధానాలను ఆ నోటిఫికేషన్‌లో ప్రకటిస్తారు.  

మరిన్ని వార్తలు