పోలవరానికి రూ.333 కోట్లు

26 Apr, 2021 04:02 IST|Sakshi

రీయింబర్స్‌ చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు

ఆ మేరకు నిధులు సమీకరించనున్న నాబార్డు

పీపీఏ ద్వారా రాష్ట్ర సర్కార్‌కు చేరనున్న నిధులు

మరో రూ.418 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు 

కేంద్ర జల్‌శక్తిశాఖకు పీపీఏ ప్రతిపాదన

ఇదిగాక ఇంకా రీయింబర్స్‌ చేయాల్సిన సొమ్ము రూ.930.37 కోట్లు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.333 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బహిరంగ మార్కెట్లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమీకరించాలని నాబార్డును ఆదేశించింది. నాబార్డు నిధులను సేకరించి ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ), పీపీఏ (పోలవరంప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది.

పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన బిల్లులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పీపీఏకు పంపింది. వాటిని పరిశీలించిన పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్‌ చేయాలని తాజాగా ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలిస్తున్న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదముద్ర వేసి, కేంద్ర ఆర్థికశాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకు రూ.17,153.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత చేసిన వ్యయం రూ.12,422.83 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.10,741.46 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఇంకా రూ.1,681.37 కోట్లను కేంద్రం బకాయిపడింది. రూ.1,681.37 కోట్లను రీయింబర్స్‌ చేయాలని పీపీఏకు రాష్ట్ర జలవరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలిస్తున్న పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్‌ చేయాలని ప్రతిపాదనలు పంపింది. ఈ 418 కోట్లు రీయింబర్స్‌ చేసినా.. ఇంకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.930.37 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు