ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి: కేంద్రమంత్రి

16 Jul, 2022 04:23 IST|Sakshi
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు జ్ఞాపిక బహూకరిస్తున్న మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. చిత్రంలో కేంద్ర మంత్రి శోభ

ఆర్బీకేల సేవలు అద్భుతం

వీటిద్వారా రైతులకు అందిస్తున్న సేవలు భేష్‌

ఈ–క్రాప్‌ ఓ వినూత్న ఆలోచన

దీని ఆధారంగానే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు

ప్రకృతిసేద్యంలో ఆదర్శంగా నిలిచారు.. అన్ని రాష్ట్రాలు వీటిని అమలు చేయాలి 

వ్యవసాయ మంత్రుల జాతీయ సదస్సులో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌

సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పిలుపునిచ్చారు. ఏపీలో గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఆర్బీకేలతో పాటు ఏపీలో అమలు చేస్తున్న ఈ–క్రాపింగ్, ప్రకృతిసేద్యాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. బెంగళూరులో వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రుల రెండురోజుల జాతీయసదస్సు శుక్రవారం ముగిసింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి సాగు ఉత్పాదకాలను నేరుగా రైతుల ముంగిటకు తీసుకువెళుతున్నారని చెప్పారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలతోపాటు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కూడా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారని చెప్పారు. సాగవుతున్న ప్రతి పంటను గుర్తించేందుకు ఈ–క్రాప్‌ వినూత్నమైన ఆలోచనన్నారు. ఈ–క్రాప్‌ను ప్రామాణికంగా తీసుకుని వాస్తవ సాగుదారులకు ఏపీలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న విధానం ఆదర్శనీయంగా ఉందని చెప్పారు.

రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రకృతిసేద్యంపై కేంద్రం ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే ఏపీలో ఈ తరహా ప్రకృతిసేద్యాన్ని పెద్దఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. లక్షలాదిమంది రైతులు ఇప్పటికే ప్రకృతిసేద్యం వైపు వెళ్లారని తెలిపారు. ఇదేరీతిలో ఏపీని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వ్యవసాయ విధానాల్లో మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. 

ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తాం 
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ రైతుభరోసా, పీఎం కిసాన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతు ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ.13,500 జమచేస్తోందని చెప్పారు. ఈ మొత్తంలో రూ.7,500 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా రూ.6 వేలను కేంద్రం పీఎం కిసాన్‌ పథకం ద్వారా సర్దుబాటు చేస్తోందని తెలిపారు. రైతుభరోసా సొమ్మును ఖరీఫ్‌ సీజన్‌కు ముందు మే నెలలోను, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌లోను తాము రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. పీఎం కిసాన్‌ నిధులు మాత్రం సీజన్‌కు మధ్య రెండేసి వేల చొప్పున జమ చేస్తున్నారని తెలిపారు.

రైతుభరోసా మాదిరిగానే మే నెలలో రూ.3 వేలు, అక్టోబర్‌లో రూ.3 వేలు సర్దుబాటు చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ఈ దిశగా ఆలోచించాలని కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ వరకు తప్పనిసరిగా ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను రైతులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ సదస్సులో కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ డాక్టర్‌ గడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు