సీఎం జగన్‌ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ

16 Sep, 2021 08:15 IST|Sakshi

సీఎం జగన్‌ చొరవతో బహ్రెయిన్‌ కార్మికుల వ్యథ సుఖాంతం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో బహ్రెయిన్‌లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారమైంది. బహ్రెయిన్‌లో ఎన్‌హెచ్‌ఎస్‌ అనే సంస్థలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సెప్టెంబర్‌ 13న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. దీనిపై తక్షణం స్పందించిన ఆ శాఖ బహ్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేసింది. (చదవండి: నేరాల నియంత్రణలో ఏపీ భేష్‌

దీంతో అక్కడి సిబ్బంది ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని, సిబ్బంది తిరిగి విధుల్లో హాజరవడానికి సంస్థ అంగీకరించినట్లు ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ వెంకట్‌ ఎస్‌ మేడపాటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహ్రెయిన్‌ పెట్రోలియం కంపెనీకి సంబంధించిన ఎన్‌హెచ్‌ఎస్‌ అనే సంస్థ సబ్‌ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. కార్మికులకు సరైన మౌలిక వసతులు కల్పించకుండా ఈ సంస్థ ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులు ఉన్నట్లు మేడపాటి పేర్కొన్నారు. కొంతమంది నేపాలీయులు, భారతీయ కార్మికుల తీరువల్ల సమస్య జఠిలమైందని, సీఎం జగన్‌ చొరవతో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
(చదవండి: జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్‌)

మరిన్ని వార్తలు