ఏపీని ఆదర్శంగా తీసుకోండి

7 Feb, 2021 03:48 IST|Sakshi

అన్ని రాష్ట్రాలకూ సూచించిన కేంద్ర విద్యుత్‌ శాఖ

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్‌ పురోగతిని కేంద్రం ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర విద్యుత్‌ శాఖ అన్ని రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. ఈ నెల 20న నీతి ఆయోగ్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో శనివారం వర్చువల్‌ పద్ధతిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్‌ రాష్ట్ర విద్యుత్‌ శాఖ పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చౌక విద్యుత్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని, గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకూ విద్యుత్‌ కొనుగోళ్లలో దాదాపు రూ.వెయ్యి కోట్లను ఆంధ్రప్రదేశ్‌ ఆదా చేసిందని తెలిపారు.

పక్కా ప్రణాళిక వల్లే..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్‌ సంస్థలను గట్టెక్కించే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. పక్కా ప్రణాళికతో వ్యవహరించడంతో 2020–21లో విద్యుత్‌ కొనుగోలు ఖర్చులో రూ.1,023.80 కోట్లు ఆదా అయ్యింది. ఒక యూనిట్‌ విద్యుత్‌ను రూ.4.55 వరకూ కొనుగోలు చేసేలా విద్యుత్‌  నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించింది. విద్యుత్‌ సంస్థలు కొనుగోలు ధరను రూ.3.12 వరకూ తగ్గించగలిగాయి. టీడీపీ హయాంలో ప్రైవేట్‌ సంస్థల జేబులు నింపేందుకు అత్యధిక రేట్లకు విద్యుత్‌ను కొన్నారు. మార్కెట్లో తక్కువకు వస్తున్నా పట్టించుకోలేదు. యూనిట్‌కు రూ.5.56 వరకూ గరిష్ట ధర చెల్లించారు. ప్రణాళిక లేకపోవడం వల్ల పీక్‌ అవర్స్‌లో యూనిట్‌కు రూ. 8 పైగా వెచ్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల విద్యుత్‌ సంస్థలు కోలుకోలేని స్థాయిలో అప్పుల ఊబిలో చిక్కుకుపోయాయి.  

మరిన్ని వార్తలు