నదుల అనుసంధానంతో దేశం సస్యశ్యామలం

13 Nov, 2021 04:21 IST|Sakshi

కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా దుర్భిక్ష పరిస్థితులకు అడ్డుకట్ట వేసి, దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. ఎక్కువ నీటి లభ్యత ఉన్న నదీ పరివాహక ప్రాంతం (బేసిన్‌) నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న నది బేసిన్‌కు నీటి మళ్లించడానికి బేసిన్‌ పరిధిలోని అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. బేసిన్‌లు, ట్రిబ్యునళ్ల అవార్డులకు అతీతంగా నదుల అనుసంధానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సాధారణ సమావేశం, నదుల అనుసంధానంపై జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.   రాష్ట్రాలు సహకరిస్తే ప్రాధాన్యత క్రమంలో నదుల అనుసంధానం పనులు చేపడతామని మంత్రి వివరించారు.

గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానాన్ని ప్రాధాన్యతగా చేపడతామని చెప్పారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేశాక.. గోదావరిలో మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ అవసరాలు తీర్చాకనే కావేరికి తరలించాలని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ప్రతిపాదించారు. కావేరికి తరలించే గోదావరి జలాల్లో సింహభాగం వాటా తమకు కేటాయించాలని తెలంగాణ సర్కార్‌ కోరింది. అలాగే, కావేరి బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలని కర్ణాటక, మహారాష్ట్ర.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కర్ణాటక, కేరళ కోరాయి. తొలి దశలో 84 టీఎంసీల గోదావరి జలాలనే కావేరికి తరలిస్తున్నారని.. రెండో దశలో కనీసం 126 టీఎంసీలు కేటాయించాలని తమిళనాడు సర్కార్‌ కోరింది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ స్పందిస్తూ.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు