తురకపాలెం గ్రామం ప్రత్యేకత ఇదే..

5 Dec, 2021 16:06 IST|Sakshi
తురకపాలెం గ్రామంలో ధ్వజస్తంభాలను చెక్కుతున్న ముస్లిం శిల్పకళాకారులు

భారతీయ సంస్కృతిలో భాగమైన భిన్నత్వంలో ఏకత్వ భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం గ్రామం. గ్రామంలోని ముస్లిం శిల్పకళాకారులు తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్‌ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు. తాము చేసే పనిలో దైవాన్ని చూస్తామంటున్నారు. తురకపాలెం గ్రామంలో అందరూ ముస్లింలే. ఇతర మతస్తులెవరూ లేరు. ఈ గ్రామానికి ఉత్తరం వైపున ప్రభుత్వ పోరంబోకు భూములు ఉన్నాయి. సదరు భూముల్లో లభించే బండరాతితో హిందువులు పవిత్రంగా భావించి దేవాలయాల్లో ప్రతిష్ఠించే ధ్వజస్తంభాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
– సాక్షి, అమరావతి బ్యూరో, మాచవరం 

వంద కుటుంబాలకు ఇదే వృత్తి.. 
సుమారు వందేళ్ల క్రితం తురకపాలెం గ్రామానికి చెందిన కరీమ్‌ సాహెబ్‌ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి. కరీమ్‌ సాహెబ్‌ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామంలో వందకుపైగా కుటుంబాలు ఈ కళనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. 


రూపుదిద్దుకున్న ధ్వజస్తంభం 

రాయిని శిల్పంగా మార్చి.. 
ధ్వజస్తంభం తయారు చేయాలంటే 10 మంది నుంచి 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడి 30 నుంచి 40 రోజుల వరకు పని చేయాల్సి ఉంటుంది. మొదటగా రాయిని గ్రామంలోని కొంత మంది కార్మికులు కలిసి ఎన్నుకుంటారు. 20 అడుగుల నుంచి 50 అడుగుల ధ్వజస్తంభం తయారు చేయటానికి 800 నుంచి 1,200 పనిదినాలు కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. రాయిని శిల్పంగా మార్చి పవిత్రమైన ధ్వజస్తంభం తయారు చేసే సమయంలో వీరు ఎంతో నిష్టగా ఉంటారు. ధ్వజస్తంభం పూర్తయిన తర్వాత జాగ్రత్తగా లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత కూడా వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజస్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. ఎంతో ఓపిక, నైపుణ్యంతో కష్టపడే వీరికి రోజుకు రూ.400 నుంచి రూ.600 మాత్రమే కూలి గిట్టుబాటు అవుతోంది.

30 ఏళ్లుగా ఇదే వృత్తి.. 
30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. అయితే ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. మిషన్లు రావటం వల్ల చేతితో తయారు చేసేవారికి అంతగా గుర్తింపు లేకుండా 
పోతోంది. 
– షేక్‌ షరీఫ్,ధ్వజస్తంభ తయారీదారుడు

మా కళను గుర్తిస్తున్నారు.. 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు ధ్వజస్తంభం ఆర్డర్‌ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. 
– జాన్‌ వలీ, ధ్వజస్తంభ తయారీదారుడు

ప్రభుత్వం సామాగ్రి అందిస్తే బాగుంటుంది.. 
ధ్వజస్తంభాలు తయారు చేసేందుకు ఉలి, సుత్తి, శ్రావణం, మలాట్, గడ్డపార లాంటి సామాగ్రి ఎంతో అవసరం. వీటిని కొనుగోలు చేయాల్సి వస్తే చాలా ఖర్చుతో కూడిన పని. మిగతా వృత్తుల వారికి ఏ విధంగా ప్రభుత్వం సామాగ్రి కోసం నగదు లేదా సామాగ్రిని అందిస్తోందో అదేవిధంగా మాకు కూడా సామాగ్రిని అందిస్తే బాగుంటుంది.
– ఎగ్జాం వలి, ధ్వజస్తంభ తయారీదారుడు 

మరిన్ని వార్తలు