Andhra Pradesh: ‘సచివాలయ’ వ్యవస్థతో యునిసెఫ్‌ జత

14 Sep, 2021 04:09 IST|Sakshi

బాలలకు పౌష్టికాహారం, విద్య, వైద్య సంబంధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు

ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కో కోఆర్డినేటర్‌ను నియమించిన యునిసెఫ్‌ 

గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనరేట్‌లో ముగ్గురు ప్రతినిధులతో ప్రత్యేక సెల్‌  

ఈ ఏడాది డిసెంబర్‌ వరకు కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలపైనే దృష్టి 

జనవరి నుంచి పౌష్టికాహారంపై అవగాహన కల్పించే కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్‌) ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రతినిధిని యునిసెఫ్‌ నియమించింది. వీరు ప్రతి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్‌) కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మరో ముగ్గురు యునిసెఫ్‌ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్‌ పనిచేస్తుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే యునిసెఫ్‌ ప్రతినిధులకు ఆ సంస్థే జీతభత్యాలు చెల్లిస్తుంది. పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు కల్పించడం లక్ష్యంగా యునిసెఫ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యునిసెఫ్‌ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. యునిసెఫ్‌ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధుల నియమించటం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి.  

జనవరి నుంచి పౌష్టికాహార సంబంధ అంశాలపై.. 
ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లోని పేదల కాలనీలలో కరోనా నియంత్రణపై యునిసెఫ్‌ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు పౌష్టికాహరం, దాని ఆవశ్యకత, పౌష్టికాహార లోపం వల్ల కలిగే దుష్ఫలితాలపై వలంటీర్లు, సచివాలయాల సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు యునిసెఫ్‌ స్టేట్‌ మేనేజర్‌ మోహనరావు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. కరోనా మూడో వేవ్‌ విజృంభించే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు 2.58 లక్షల మంది వలంటీర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం అన్ని పాఠశాలల్లో యునిసెఫ్‌ ప్రతినిధులు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి విద్యార్థులకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు.  

మరిన్ని వార్తలు