ట్రిపుల్‌ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా

1 Oct, 2022 14:10 IST|Sakshi

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యల్పంగా విద్యార్థులు ఎంపికయ్యారు. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 4,400 సీట్లు ఉండగా, వీటిలో 400 సీట్లు ఈడబ్ల్యూఎస్‌ సీట్లు కాగా, ప్రత్యేక కేటగిరి కింద 280 సీట్లు మినహా 4,120 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు. 

వీటిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 463 మంది, గుంటూరులో 434 మంది, నెల్లూరులో 393 మంది, పశ్చిమ గోదావరిలో 128 మంది, శ్రీకాకుళంలో 391 మంది, విజయనగరంలో 337 మంది, విశాఖలో 244 మంది, తూర్పు గోదావరిలో 275 మంది, కృష్ణాలో 269 మంది, కడపలో 231 మంది, కర్నూలో 260 మంది, చిత్తూరులో 357 మంది, అనంతపురంలో 232 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికయ్యారు.  

ఎంపికైన వారిలో బాలికలే అధికం
ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. బాలికలు 2,721 మంది ఎంపికవ్వగా, బాలురు 1,399 మంది మాత్రమే ఎంపికయ్యారు. మొత్తం సీట్లలో ఎంపికైన బాలికల శాతం 66.04, బాలుర శాతం 33.96గా ఉంది. బాలికలు నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి 677 మంది, ఇడుపులపాయకు 676 మంది, ఒంగోలుకు 680 మంది, శ్రీకాకుళానికి 688 మంది ఎంపికయ్యారు. ఏపీ నుంచి 4,014 మంది, తెలంగాణ నుంచి 106 మంది ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన వారిలో ఉన్నారు. (క్లిక్ చేయండి: అక్టోబర్‌ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్‌ సేవలు..)

ముగిసిన ట్రిపుల్‌ ఐటీ  ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన 
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న అడ్మిషన్లలో భాగంగా సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు నిర్వహించిన ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి దివ్యాంగులకు 120 సీట్లు, సైనికోద్యోగుల పిల్లలకు 80, ఎన్‌సీసీ 40, స్పోర్ట్స్‌ కోటా 20, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాలో 20 సీట్లు ఉన్నాయి. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.ఎస్‌.ఎస్‌.వి.గోపాలరాజు పర్యవేక్షణలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహించారు. క్రీడా కోటాకు 622 మంది, ఎన్‌సీసీ కోటాకు 1,267 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు 272 మంది, వికలాంగుల కోటాకు 198 మంది, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాకు 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు