విద్యల నగరానికి సాంకేతిక విద్యాహారం

16 Jan, 2022 09:25 IST|Sakshi

విజయనగరం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీకి యూనివర్సిటీ హోదా

జేఎన్‌టీయూ గురజాడ, విజయనగరం పేరుతో ఏర్పాటు

ఉత్తరాంధ్ర వాసులకు చేరువలో నాణ్యమైన ఉన్నత విద్య

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యల నగరంగా పేరొందిన విజయనగరం వాసులకు ఇన్నాళ్లకు యూనివర్సిటీ లేని లోటు తీరింది. ఉత్తరాంధ్ర ప్రజలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విజయనగరంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–కాకినాడ ఇంజనీరింగ్‌ కాలేజీకి పూర్తిస్థాయి యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.  

గురజాడకు గౌరవం.. 
విజయనగరంలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఇన్నాళ్లూ జేఎన్‌టీయూ–కాకినాడకు అనుబంధంగా కొనసాగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఇప్పుడు జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జేఎన్‌టీయూ–జీవీ) యూనివర్సిటీగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర యూనివర్సిటీల చట్టాన్ని సవరించగా తాజాగా అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఇంజనీరింగ్‌ కళాశాలను యూనివర్సిటీగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మార్పు చేశారు. అంతేకాదు సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో వర్సిటీని నెలకొల్పి ఉత్తరాంధ్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు.  

వైఎస్సార్‌ హయాంలో ఏర్పాటు.. 
పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని నాడు దివంగత వైఎస్సార్‌ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం శివారులో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలను 2007లో 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో నెలకొల్పారు. ఎప్పటికైనా యూనివర్సిటీగా విస్తరించాలని భావించారు. ఐదు గ్రూప్‌లతో ఇక్కడ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రారంభమైంది. తొలుత స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో తరగతులను నిర్వహించారు.

మూడేళ్లలోనే రెండు వసతి గృహాలను నిర్మించారు. పక్కా భవనాల నిర్మాణం పూర్తి కావడంతో 2010 నుంచి సొంత స్థలంలోనే కళాశాల ప్రారంభమైంది. ఐదు కోర్సులకు సంబంధించి ఫ్యాకల్టీ పోస్టులను మంజూరు చేస్తూ వైఎస్సార్‌ హయాంలోనే ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఏడు ఇంజనీరింగ్‌ కోర్సులతో ఏడాదికి 420 మంది బీటెక్‌ విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. ఆరు కోర్సుల్లో ఎంటెక్‌ నిర్వహిస్తున్నారు. ఎంసీఏ కూడా ఉంది.

ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం
జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలను యూనివర్సిటీగా విస్తరించడం ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం లాంటిది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 40 ఇంజనీరింగ్‌ కళాశాలల నిర్వహణ జేఎన్‌టీయూ–కాకినాడ పర్యవేక్షణలో జరుగుతోంది. విద్యార్థులు ఎలాంటి సమస్య తలెత్తినా, మార్కుల జాబితాలు, ఇతరత్రా ధ్రువపత్రాల కోసం కాకినాడ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే యూనివర్సిటీ ఏర్పాటు కావడం వల్ల ఆ సమస్యలు ఉండవు. మరింత నాణ్యమైన బోధన అందుతుంది. 
– ప్రొఫెసర్‌ జి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూ విజయనగరం 

పెరిగిన ప్లేస్‌మెంట్స్, నాణ్యత.. 
వైఎస్సార్‌ హఠాన్మరణం అనంతరం జేఎన్‌టీయూ కళాశాలపై పాలకులు నిర్లక్ష్యం వహించారు. నిధులు కేటాయించక పోవడంతో పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీగా సీఎం జగన్‌ మార్పు చేశారు. రెండేళ్లుగా ఏటా 150 మందికిపైగా విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌లు లభించడంతో నాణ్యత పెరిగింది.  


 
కొండవాలున సుందర ప్రాంగణం
విజయనగరం శివారులోని కొండవాలున జేఎన్‌టీయూ ఏర్పాటైంది. దాదాపు 15,265 చదరపు మీటర్ల స్థలంలో మూడు అకడమిక్‌ బ్లాక్‌ భవనాలు, 2,865 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కళాశాల కేంద్ర గ్రంథాలయ భవనం ఇక్కడి ప్రత్యేకత. విద్యార్థులకు వైద్య సదుపాయాల కోసం 354 చదరపు మీటర్ల స్థలంలో డిస్పెన్సరీకి పక్కా భవనం ఉంది. శాఖల వారీగా వర్క్‌షాప్‌ షెడ్స్, ల్యాబ్‌లు, క్యాంటీన్లకు పక్కా భవనాలున్నాయి. చెరో రెండు చొప్పున విద్యార్థులు, విద్యార్థినులకు వసతి గృహాలను కేటాయించారు. క్రీడా మైదానం, ఇండోర్‌ స్టేడియం సదుపాయాలు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు