దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ గుర్తింపు, ఇమ్యూనిటీపై తీవ్ర ప్రభావం

20 Apr, 2023 04:49 IST|Sakshi

మానవ రోగ నిరోధక శక్తిపై దోమ పోటు 

వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి 

మనిషి రోగ నిరోధక రక్షణ వ్యవస్థను హైజాక్‌ చేస్తున్నట్టు గుర్తింపు 

ఒక్క మలేరియాతోనే 6 లక్షల మంది: డబ్ల్యూహెచ్‌ఓ  

దోమకాటుతో ఏటా 7.25 లక్షల మంది మరణం 

సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రా­ణి­గా వర్జీ­నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించా­రు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీ­వ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించా­రు. దోమ లా­లా­జలంలోని ఆర్‌ఎన్‌ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవ­స్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. 

సరికొత్త చికిత్సకు మార్గం 
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉ­న్న­ట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చ­లు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.  

వెలుగులోకి కొత్త విషయాలు 
ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌పై పరిశోధనలు చేయగా.. కొత్త విష­యాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ మనిషి­లోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్‌ తానియా స్ట్రిలెట్స్‌ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు.

ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ (రిబోన్యూక్లియిక్‌ యాసిడ్‌)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్‌ట్రా సెల్యులర్‌ వెసికిల్స్‌’ అని పిలిచే మెంబ్రేన్‌ (పొర) కంపార్ట్‌మెంట్లలో సబ్‌ జెనోమిక్‌ ఫ్లేవివైరల్‌ ఆర్‌ఎన్‌ఏ (ఎస్‌ఎఫ్‌ ఆర్‌ఎన్‌ఏ) ద్వారా డెంగీ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్‌ ఇన్ఫెక్షన్‌ స్థాయిని ఎస్‌ఎఫ్‌ ఆర్‌ఎన్‌ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది.

ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్‌ఎఫ్‌ ఆర్‌ఎన్‌ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్‌ వెల్లడించారు. ఈ సబ్‌ జెనోమిక్‌ ఫ్లేవివైరల్‌ ఆర్‌ఎన్‌ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్‌ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్‌ఎఫ్‌ ఆర్‌ఎన్‌ఏ అడ్డుకుంటోందని తేల్చారు.  

మరిన్ని వార్తలు