మంత్రి పేర్ని నానిపై దుండగుడి దాడి

29 Nov, 2020 13:48 IST|Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం దుండగుడు మంత్రి కాళ్లకు దండం పెడుతూ పదునైన తాపీతో దాడికి తెగబడ్డాడు. అయితే వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 

స్పందించిన పేర్ని నాని
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... 'ఈ రోజు అమ్మ పెద్దకర్మ ఉండటంతో పూజాదికాలు పూర్తి చేసుకొని కార్యక్రమానికి వచ్చిన ప్రజలను పలకరిస్తున్నాను. ఇదే క్రమంలో ప్రజలతో మాట్లాడుతూ భోజనాల దగ్గరకు వెళ్తూ.. గేటు దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాళ్ల మీద పడుతున్నట్లుగా ఇనుప వస్తువుతో నా మీద దాడికి ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలో నాకు ఎలాంటి గాయం కాలేదు. అది బెల్ట్‌ బకెల్‌కి తగలడంతో నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. నిందితుడు మరోసారి దాడికి ప్రయత్నించగా అప్రమత్తమైన చుట్టూ ఉన్నవారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నేను క్షేమంగానే ఉన్నాను ఏమీ జరగలేదు' అని మంత్రి తెలిపారు.


త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం: సీఐ
మద్యం మత్తులో మంత్రి పేర్ని నానిపై దాడి చేసిన వ్యక్తిని చెమ్మన్నగిరి పేటకు చెందిన బడుగు నాగేశ్వరరావుగా గుర్తించామని సీఐ వెంకటరమణ తెలిపారు. దాడి ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించాము. నాగేశ్వరరావు నేర చరిత్రపై ఆరా తీస్తున్నాము. నిందితుడిపై మంత్రి అనుచరులు ఫిర్యాదు చేశారు. అన్నికోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నాము. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాము' అని సీఐ తెలిపారు. మరోవైపు మంత్రి పేర్ని నానిని... మంత్రి కొడాలి నాని, పార్టీ నేత తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, వల్లభనేని వంశీ తదితరులు పరామర్శించారు.

దాడికి యత్నించిన ఆగంతకుడు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా