2 కిలోమీటర్లకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం

24 Sep, 2020 03:51 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 560 కేంద్రాల ఏర్పాటుకు సర్కారు చర్యలు 

ప్రతి చోటా ఇద్దరు వైద్యాధికారులు

ముగ్గురు స్టాఫ్‌ నర్సులు కూడా..

పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు

సాక్షి, అమరావతి:  గ్రామీణ వైద్య వ్యవస్థను గాడిలో పెడుతూనే పట్టణ పేదలకూ మెరుగైన వైద్య సేవలు, రాష్ట్ర ప్రభుత్వం,  పట్టణ ఆరోగ్య కేంద్రంత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వీటిలో ఇప్పటికే పీపీపీ పద్ధతిలో పనిచేస్తున్న 259 కేంద్రాల గడువు ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వమే వీటిని నిర్వహించనుంది. ప్రతి వార్డుకు 2 కి.మీ. దూరంలో అర్బన్ హెల్త్‌ కేంద్రం లేదా పావుగంటలో ఆస్పత్రికి నడిచి వచ్చేలా 110 మునిసిపాలిటీల్లో మ్యాపింగ్‌ చేసి కేంద్రాలను నిర్ణయించారు. 

త్వరలో నిర్మాణ పనులు.. 
► పట్టణాల్లో 215 ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగిలినవి కూడా సొంతంగానే ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇప్పటికే 355 ఆస్పత్రులకు స్థలాలు గుర్తించిన నేపథ్యంలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 

మెరుగైన సేవలు ఇలా.. 
► గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టరు, నర్సు ఒక్కరు చొప్పున మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రతి కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు సేవలందించనున్నారు. 
► గతంలో ఫార్మసిస్ట్‌ లేరు. ఇప్పుడు ఫార్మసిస్ట్‌తోపాటు ల్యాబ్‌టెక్నీషియన్  కూడా అందుబాటులో ఉంటారు. 
► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే సేవలందించగా ఇప్పుడు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ పనిచేయడంతోపాటు 60 రకాల టెస్టులు చేసేలా ల్యాబ్‌ సదుపాయం కల్పించారు. 

నిధుల దుబారాకు అడ్డుకట్ట.. 
తెలుగుదేశం పార్టీ హయాంలో పీపీపీ పేరిట జరిగిన నిధుల దుర్వినియోగానికి ఇప్పుడు అడ్డుకట్ట పడింది. గతంలో ఒక్కో కేంద్రానికి నెలకు సగటున రూ.4.8 లక్షలు చొప్పున వ్యయం చేయగా ఇప్పుడు కేవలం రూ.2 లక్షలతో అంతకంటే మెరుగ్గా సేవలు అందనుండటం గమనార్హం. 
► గతంలో నాలుగేళ్లకు సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు అంతే వ్యవధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కేవలం రూ.255 కోట్లతోనే మెరుగ్గా సేవలు అందించేందుకు సిద్ధమైంది.   

మరిన్ని వార్తలు