ఒకటి నుంచి పట్టణ సర్వే పనులు

24 Oct, 2022 05:39 IST|Sakshi

ఆస్తిదారులకు నోటీసుల జారీకి నిర్ణయం

123 స్థానిక సంస్థలకు సరిహద్దుల గుర్తింపు

648 గ్రామాల రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు 

ఆరు నెలల్లో సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయం 

రికార్డుల్లో 38 లక్షల ఆస్తులు.. ఇందులో మరో 10 శాతం పెరిగే అవకాశం

సాక్షి, అమరావతి: పట్టణ ఆస్తుల సమగ్ర భూ హక్కు సర్వే పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వేగవంతం చేసింది. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆయా నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలోని ఆస్తుల హక్కుదారులకు నోటీసులు జారీచేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతమున్న రికార్డుల ప్రకారం ఆస్తులు, వాటి యజమానుల గుర్తింపు ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. మొత్తం 123 స్థానిక సంస్థల్లో 38 లక్షల ఆస్తులున్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పట్టణాల్లోని ఆస్తుల సర్వే ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. ఇప్పటికే 20 వేల మంది వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలతో పాటు ఇతర మున్సిపల్‌ సిబ్బందికి మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించారు. ప్రతి వార్డుకి ఐదుగురు సర్వే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

648 గ్రామాల రికార్డులు పరిశీలన
పట్టణాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలతోపాటు ఒకే స్థలం లేదా ఇల్లు రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ చేయడం వంటి సమస్యలు లేకుండా ఆయా ఆస్తిదారులకు నమ్మకమైన గుర్తింపు పత్రం ఇచ్చేందుకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆస్తుల సర్వేకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ పూర్తయినట్లయితే వ్యవసాయ భూములకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఉన్నట్లుగానే. పట్టణాల్లోని స్థలాలు, ఇళ్లకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు ఆస్తులకు సమగ్రమైన రికార్డులు సిద్ధమవుతాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాలు ఉండగా, వాటిల్లో వందలాది గ్రామాలు చేరాయి. దాంతో పట్టణాల్లో విలీనమైన 648 గ్రామాల రికార్డులు, ప్రస్తుతమున్న రికార్డులతో సరిపోల్చి ఏ ఆస్తి ఎవరి పేరిట నమోదైందో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వేతో పాటు రెవెన్యూ రికార్డులు, ప్లానింగ్‌ వంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్‌ కమిషనరేట్‌లో మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (పీఎంయూ)ను ఏర్పాటుచేశారు.

ఇందులో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల సిబ్బందితో పాటు మున్సిపల్‌ సిబ్బందిని నియమించారు. ఇదే తరహాలో 123 మున్సిపాలిటీల్లోనూ పీఎంయూ విభాగాలను ఏర్పాటుచేయనున్నట్లు కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. నవంబర్‌ ఒకటి నుంచి ఆస్తుల యజమానులకు నోటీసులు జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. యజమానుల నుంచి అభ్యంతరాలను సైతం తీసుకుని, వాటిని పరిష్కరించి మొత్తం సర్వే పనులను ఆరు నెలల్లో పూర్తిచేయనున్నట్లు ఆయన వివరించారు. 

రికార్డుల్లో 38 లక్షల ఆస్తులు
ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న సర్వే నంబర్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్న డేటా ప్రకారం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 31 లక్షల ఆస్తులు, ఏడు లక్షల ఖాళీ స్థలాలున్నట్లు మున్సిపల్‌ శాఖ గుర్తించింది. అయితే, సర్వే ప్రక్రియ మొదలైతే రికార్డుల్లోకి రాని ఆస్తులు మరో 10 శాతం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వేలో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. వేటికవి ప్రత్యేకంగా గుర్తించి డేటా తయారుచేస్తున్నారు.

అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వాలు పురపాలక సంఘాల్లో పన్నుల వసూళ్లపై పెట్టిన దృష్టి ఆస్తుల గుర్తింపుపై పెట్టకపోవడంతో కొనుగోళ్లు, అమ్మకం రిజిస్ట్రేషన్‌ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సమగ్రంగా సర్వే ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని స్థానిక సంస్థలకు సంబంధించి సరిహద్దుల సర్వేను పూర్తిచేశామని, సర్వేలో పాల్గొనే సిబ్బందికి మూడంచెల్లో మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇచ్చామని రీ సర్వే ప్రత్యేకాధికారి బి.సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తుల రికార్డులను సమగ్రంగా ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు ఆయన వివరించారు.  

మరిన్ని వార్తలు