చెత్తకు యూజర్‌ చార్జీ కొత్తకాదు

28 Mar, 2022 04:03 IST|Sakshi

గత ప్రభుత్వ హయాంలోనే పలు మునిసిపాలిటీల్లో వసూళ్లు

కేంద్రం ప్రభుత్వ నిబంధనలతో చార్జీల వసూళ్లు ప్రారంభం 

గుంటూరు మున్సిపాలిటీలో 2015లోనే అమలు 

ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటికి రోజుకు రూ. 1 మాత్రమే 

ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే చార్జీలు తక్కువ 

సాక్షి, అమరావతి: చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడం లేదు. గతం నుంచి ఈ యూజర్‌ చార్జీల వసూళ్లు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో ఘనవ్యర్థాల సమస్యకు పరిష్కారం కోసం 2014 అక్టోబర్‌లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. పెరిగిపోతున్న ఘన వ్యర్థాలను ప్రాసెస్‌ చేసేందుకు, పరికరాల నిర్వహణకు ప్రజల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం స్థానిక పాలన సంస్థలు యూజర్‌ చార్జీ వసూలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను 2016 సెప్టెంబర్‌లో ఆదేశించింది. కేంద్రం అమలు చేస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలకు నిధులు కావాలంటే ‘వినియోగ రుసుం’ తప్పనిసరని చెప్పింది. దీంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ప్రజల నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. 

గుంటూరులో 2015లో అమలు 
వీధుల్లో పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త తరలింపు వంటి పనులకోసం గుంటూరు నగరంలోని దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్‌ హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, సూపర్‌ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని ఆ నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లో తీర్మానించింది. సముదాయం విస్తీర్ణం, అక్కడ ఉండే జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్‌ నుంచి యూజర్‌ చార్జీల వసూలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 50 చొప్పున, వాణిజ్య సముదాయాలైతే రూ. 5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ. 1,500 వసూలు చేశారు.

ఇతర రాష్ట్రాల కంటే మనకే తక్కువ చార్జీలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రతి ఇంటికి రోజుకు తొలుత రూ.3 చొప్పున వసూలు చేయగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 5కు పెంచారు. ఇండోర్‌లోను ప్రతి ఇంటికీ నెలకు రూ. 150 వరకు వసూలు చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు సైతం ఏపీ కంటే ఆయా రాష్ట్రాల్లో అధికంగా చార్జీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

రోజుకు ఇంటికి రూ.1 మాత్రమే..
ఘన వ్యర్థాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలు వినియోగ రుసుంను వసూలు చేస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై భారం పడకుండా 2021 అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా ప్రారంభించిన ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ (క్లాప్‌) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రజల నుంచి నెలకు రూ. 30, దారిద్య్రరేఖకు పైన ఉన్న వారి నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్లలో రూ. 90, స్పెషల్‌/ సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీల్లో రూ. 60 చొప్పున, నగర పంచాయతీల్లో రూ. 30 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు.

దుకాణాలు, ఫంక్షన్‌ హాళ్ల స్థాయిని బట్టి రూ. 150 నుంచి ఆ పైన చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, క్లాప్‌ కార్యక్రమం గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించినా.. తొలుత ప్రజలకు ఇంటింటి చెత్త సేకరణపై అవగాహన కల్పించి, మెరుగైన సేవలతో ఫలితాలను చూపించిన అనంతరం గత ఏడాది డిసెంబర్‌ నుంచి చార్జీల వసూలు ప్రారంభించారు. అదీ మొత్తం 123 మున్సిపాలిటీల్లో తొలి విడతగా పూర్తిస్థాయిలో చెత్త సేకరణ వాహనాలను అందించిన 17 మున్సిపాలిటీల నుంచే ఈ వసూళ్లు చేపట్టారు. ఈ విధంగా నాలుగు నెలల్లో ఆయా మున్సిపాలిటీల నుంచి సుమారు రూ. 12 కోట్లు వసూలైంది. 

మరిన్ని వార్తలు