Visakha Garjana Today: విశాఖకు జై!.. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన

15 Oct, 2022 04:38 IST|Sakshi

దిక్కులు పిక్కటిల్లేలా నేడు ‘విశాఖ గర్జన’

వికేంద్రీకరణే లక్ష్యంగా ఉదయం 9 గంటలకు శాంతియుత ర్యాలీ ప్రారంభం

అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బీచ్‌ రోడ్డులో వైఎస్సార్‌ విగ్రహం వరకు పాదయాత్ర

రాజకీయాలకు అతీతంగా భారీ ప్రదర్శన.. అన్నివర్గాల వారి మద్దతు

‘పరిపాలన రాజధానిగా విశాఖ’కు  భారీగా ప్రజలు తరలివచ్చే ఛాన్స్‌

ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు

సాక్షి, విశాఖపట్నం: తరతరాల వెనుకబాటు తనంపై తమ గొంతు వినిపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి వేచి చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 1956లోనే రాజధానిగా విశాఖ ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ వీలు కాలేదని, ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు తమ చిరకాల కోరిక నెరవేరబోతున్న సమయంలో అడ్డుకునే వారికి బుద్ది చెప్పేలా శాంతియుతంగా గర్జనను నిర్వహిచేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ నినదిస్తున్నారు.

నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జనకు మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం పూర్తి మద్దతు తెలిపింది. విశాఖ గర్జన విజయవంతానికి వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు మాత్రం గర్జనకు దూరంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో గాజువాకలో ఘోరంగా ఓడించారన్న అక్కసుతో ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా తన వాణిని కాస్త జనవాణిగా వినిపించేందుకు జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖకు శనివారమే వస్తుండడం గమనార్హం.

టీడీపీ నేతలు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్ముతున్నారు. తమ హయాంలో జరిగిన భూకబ్జాలను కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా.. భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నేతలే వాటి గురించి మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైగా ఇదే రోజు ఉత్తరాంధ్ర నేతలందరూ ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యేందుకు సిద్ధమవ్వడంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది.

శుక్రవారం ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ లజపతిరాయ్, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు పలువురు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావులు ర్యాలీ జరిగే రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ‘విశాఖ గర్జన’ జెండాను, పాటను ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీ రూట్‌మ్యాప్‌ను పోలీసులకు అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా వెళ్లేలా వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా వలంటీర్లు సహాయ పడతారు. సాగర తీరాన మూడున్నర కిలోమీటర్ల మేర సుమారుగా లక్ష మందితో గర్జన జరగనుంది.

ర్యాలీ సాగేదిలా..
ఉత్తరాంధ్ర నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ఎల్‌ఐసీ బిల్డింగ్‌.. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానుంది. జైలు రోడ్డు జంక్షన్, సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్‌ జంక్షన్, వాల్తేర్‌ క్లబ్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేర్‌ జంక్షన్‌ మీదుగా ఆర్‌కే బీచ్‌ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, మేధావులు నివాళులర్పించి.. ర్యాలీ ప్రారంభిస్తారు.  ర్యాలీ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం ఇతర  ప్రాంతాలకు వలస వెళ్తుండటం, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుండటంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖ గర్జన నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు