టీకా ప్రక్రియపై ఎన్నికల ప్రభావం

26 Mar, 2021 05:22 IST|Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తవ్వక పోవడంతో మందకొడిగా వ్యాక్సినేషన్‌

పట్టణాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సోమవారం నుంచి వేగంగా టీకాలు    

60 ఏళ్లు పైబడిన 52.52 లక్షల మందికి టీకా వేయాలన్నది లక్ష్యం

ఇందులో ఇప్పటి వరకు టీకా వేయించుకున్న వారు 5.11 లక్షలు

45 నుంచి 60 ఏళ్లలోపు జబ్బులున్న వారు 6.31 లక్షలు

వీరిలో ఇప్పటి వరకు టీకా వేయించుకున్నది 2.19 లక్షలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రకియ అర్ధంతరంగా నిలిచిపోవడంతో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై తీవ్ర ప్రభావం పడింది. 60 ఏళ్లు పైబడిన వారికి, వివిధ రకాల జబ్బులు గల 45  నుంచి 60 ఏళ్ల లోపు వారికి వేగంగా కోవిడ్‌ టీకా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగియక పోవడంతో ఈ కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారు 52,52,042 మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది.

వీరిలో ఈ నెల 22వ తేదీ వరకు 5.11 లక్షల మందికి మాత్రమే కోవిడ్‌–19 టీకా వేయగలిగారు. రాష్ట్రంలో డయాబెటిస్, హైపర్‌ టెన్షన్, క్యాన్సర్, ఊపిరితిత్తుల జబ్బులు గల 45 – 60 ఏళ్ల మధ్య ఉన్న 6,31,299 మందికి కూడా టీకా వేయాలని ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 22 వరకు వీరిలో 2.19 లక్షల మందికి మాత్రమే టీకా వేయగలిగారు. మునిసిపల్‌ ఎన్నికలు ముగియడంతో పట్టణాల్లో సోమవారం నుంచి ముమ్మరంగా టీకా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కొత్త ఎన్నికల కమిషనర్‌ బాధ్యతలు చేపట్టగానే మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయించి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
 


 

మరిన్ని వార్తలు